రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు. దీనికోసం వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతంచేయాలని కోరారు.
ఈ సారి వానకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ఏటా.. ప్రతి సీజన్లో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ, పోషకాహార భద్రత మాత్రం సాధించలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్ధకమైన ఆహారం తినడంలేదన్నారు. బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించాలని సీఎం చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతోపాటు, రోగ నిరోధకశక్తి పెరుగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం పంటలను సాగుచేయడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేసేందుకు సీఎం కేసీఆర్ మూడురోజులపాటు వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పత్తి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులపై అధ్యయనం చేయాలని చెప్పారు. సమావేశాల్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఆగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.