సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 19, 2020

సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు

దేశంకోసం ప్రాణత్యాగం చేసిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సైనికలాంఛనాలతో ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు, భారీగా తరలివచ్చిన ప్రజలు దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ అమరవీరుడికి వీడ్కోలు పలికారు. సంతోష్‌బాబు ఇంటినుంచి ఐదు కిలోమీటర్లమేర రోడ్డుకిరువైపులా నిల్చున్న ప్రజలు ‘సంతోష్‌బాబు అమర్హ్రే.. వీరుడా నీ ఆశయం గొప్పది.. నీ త్యాగం చిరస్మరణీయం’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో కేసారంవద్ద ఉన్న సొంతస్థలంలో తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌ అమరవీరుడి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. 
ఉదయం తొమ్మిది గంటలకు సూర్యాపేట పట్టణం విద్యానగర్‌లోని సంతోశ్‌బాబు నివాసం వద్ద ఆర్మీ అధికారులు కవాతు, సలామీ నిర్వహించగా.. కుటుంబసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి.. తెలంగాణ తల్లి విగ్రహం, శంకర్‌విలాస్‌సెంటర్‌, కోర్టు చౌరస్తా, మున్సిపల్‌ కాంప్లెక్స్‌, ఎస్పీ కార్యాలయం నుంచి కేసారం వరకు సుమారు ఆరు కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. అమరవీరుడిని చివరిచూపు చూసేందుకు జిల్లావ్యాప్తంగా వేలమంది ప్రజలు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

మిలిటరీ లాంఛనం.. హిందూ సంప్రదాయం

కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటుచేసిన చితిపైకి మిలిటరీ అధికారులు సంతోష్‌బాబు పార్థివదేహాన్ని చేర్చారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది గన్‌డౌన్‌ చేసి.. అమరవీరుడికి సెల్యూట్‌ చేస్తూ కవాతు నిర్వహించారు. అనంతరం మూడురౌండ్లు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం సంస్కారాలు నిర్వహించారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషి కుమారుడిని ఎత్తుకుని మామ ఉపేందర్‌తోపాటు భర్త చితిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. తండ్రి ఉపేందర్‌ సంతోష్‌ చితికి నిప్పంటించి అంత్యక్రియలను పూర్తిచేశారు. 

దేశభక్తి ముందు తలవంచిన కరోనా భయం

కరోనా వ్యాప్తి వేళ జనం గుమికూడవద్దని హెచ్చరికలు ఉన్నా దేశభక్తి ముందు అవి నిలబడలేదు. సంతోష్‌బాబును కడసారి చూసేందుకు వేలమంది తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవునా రోడ్డుకిరువైపులా పెద్దసంఖ్యలో నిలబడి నినాదాలు చేశారు. పూలవర్షం కురిపించారు. జాతీయజెండాలు పట్టుకుని భారత్‌ మాతాకీ జై.. సంతోష్‌బాబు అమర్హ్రే.. జైజవాన్‌ జైకిసాన్‌ నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, గాదరి కిశోర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.