అమరుల త్యాగాలు వృథా కానీయం... సన్నద్ధంగా ఉన్నాం: ఎయిర్ చీఫ్ మార్షల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 20, 2020

అమరుల త్యాగాలు వృథా కానీయం... సన్నద్ధంగా ఉన్నాం: ఎయిర్ చీఫ్ మార్షల్

దేశ సరిహద్దుల్లో ఏవైనా అనూహ్య పరిణామాలు తలెత్తినా తిప్పికొట్టడానికి సన్నద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా తెలిపారు. లడఖ్‌లో భారత్, చైనా మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గల్వాన్‌ లోయలో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని భదౌరియా స్పష్టం చేశారు. హైదరాబాద్ దుండిగల్‌ ఎయిర్ ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరైన భదౌరియా.. వైమానిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ చీఫ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి చర్యలకైనా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

‘సైన్యాలను ఉపసంహరించుుకోవాలని ఇరు దేశాల మిటలటరీ అధికారుల నిర్ణయించిన తర్వాత చైనా బలగాలు దాడికి తెగబడ్డాయి. ఈ చర్య వల్ల వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొల్పడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింద’ని భదౌరియా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతామని.. ఇందుకోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడమని మన సైనికులు మరోసారి నిరూపించారని భదౌరియా వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా అమరులైన సంతోష్ బాబు బృందానికి ఆయన నివాళులు అర్పించారు.