సూర్యాపేట్‌కు కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

సూర్యాపేట్‌కు కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం

లఢక్ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దుల్లో రెండు దేశాల చోటు చేసుకున్న ఘర్షణల్లో వీరమరణం పొందిన 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్‌బాబ పార్థివ దేహం ఆయన స్వస్థలమైన తెలంగాణలోని సూర్యాపేట్‌కు చేరుకుంది. హైదరాబాద్ నుంచి రాత్రి 11: 30 గంటల సమయంలో ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో నివాసానికి తీసుకొచ్చారు. వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహన్ని చూడగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో విషాదం కట్టలు తెంచుకుంది. పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.
కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహాన్ని ప్రత్యేక సైనిక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి కేటీఆర్, పలువురు ఆర్మీ అధికారులు నివాళి అర్పించారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో ప్రత్యేక అంబులెన్స్‌లో పార్థివదేహాన్ని సూర్యాపేట్‌లోని ఆయన నివాసానికి తీసుకెెళ్లారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ఉంచుతారు. సంతోష్ బాబును కడసారిగా చూడటానికి వందలాది మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సంతోష్‌బాబు నివాసం వద్ద ఆయన పార్థివదేహానికి సైనికులు గౌరవవందనాన్ని అర్పిస్తారు. దీనికోసం 50 మంది ఆర్మీ అధికారులు, జవాన్లు ఇప్పటిక సూర్యాపేట్‌కు చేరుకున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సంతోష్‌‌బాబు స్వస్థలం కేసారంలో ఆయన కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. అంత్యక్రియల ఏర్పాట్లను కూడా జిల్లా అధికారులు పూర్తి చేశారు.
సంతోష్‌బాబు నివాసం నుంచి కేసారం గ్రామ వరకు సైనిక వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతిమక్రియలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అంత్యక్రియలకు 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. సంతోష్‌ బాబు పార్థివదేహానికి కడసారిగా చూడటానికి వచ్చే వారు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సూచనలను జారీ చేసింది.