తెలంగాణలో ఆందోళ రేపుతున్న కరోనా మరణాలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

తెలంగాణలో ఆందోళ రేపుతున్న కరోనా మరణాలు..

తెలంగాణలో శుక్రవారం(జూన్ 12) కొత్తగా 164 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. నిన్న కూడా 9 మంది కరోనాతో మృత్యువాత పడటం గమనార్హం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4484కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 174కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇవాళ నమోదైన కేసుల్లోనూ జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 133 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌, రంగారెడ్డిలో 6 చొప్పున, సంగారెడ్డి 4, నిజామాబాద్‌ 3, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ములుగు 2 చొప్పున, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్‌, వనపర్తిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 449 మంది విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు,వలస కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకూ 2278 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం 2032 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో మృతుల సంఖ్య ప్రతీ రోజూ 5కి పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆదివారం (జూన్ 7) రాష్ట్రంలో అత్యధికంగా 14 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నగరంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయన్న ప్రచారం మొదలైంది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని.. మరో రెండు,మూడు రోజుల్లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని వెల్లడించారు.