బోనం ఇంట్లోనే - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

బోనం ఇంట్లోనే

ఆషాఢం వచ్చిందంటే చాలు.. అమ్మకు బోనం లేస్తుంది. వర్షాకాలం ఆరంభంలో మహమ్మారుల బారి నుంచి తమను కాపాడాలని.. వానలు సక్కగ కురువాలని, ఎవుసం మంచిగ సాగి.. గాబులు బాగా నిండాలని గుండెలనిండా కోరుకొంటూ.. అమ్మవారిని కొలిచే సంబురం బోనాలు. కుండల్లో బెల్లంబువ్వ వండి.. పసుపు కుంకుమలతో వాటిని అలంకరించి నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా గుడికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సంతర్పణచేసే అద్భుతమైన కార్యక్రమం. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. కానీ ఏ మహమ్మారుల నుంచి తమను కాపాడాలని అమ్మవారిని కోరుకొంటూ ఏటా బోనాలు జరుపుకొంటామో.. ఇప్పుడు ఏకంగా విశ్వమారి మన సమాజంపై దండెత్తింది. 
ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సామూహికంగా బోనాలు జరుపుకోవడం మరింత ప్రమాదకరమని పండితులు, అమ్మవారి దేవాలయాల పూజారులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదని చెప్తున్నారు. ‘బోనం అంటే భోజనం. అమ్మవారికి  భోజనం పెట్టడమే బోనాలు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో దోషమేమీ ఉండదు’ అని పండితులు అంటున్నారు. రోగాలు రాకూడదని కోరుకొనే వారే.. విశృంఖలంగా వ్యాపిస్తున్న రోగాల నడుమ ఊరేగింపులు, సామూహిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని అంటున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రజలపై యుద్ధంచేస్తున్నది. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి. పైగా సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిలేదు. 

Post Top Ad