సీఎం కారు అతి వేగం.. జరిమానా విధించిన అధికారులంటూ విచిత్ర ప్రచారం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

సీఎం కారు అతి వేగం.. జరిమానా విధించిన అధికారులంటూ విచిత్ర ప్రచారం..

చెప్పే వాడు చైనా వాడైతే వినేవాడు వియత్నాం వాడట. ఈ సామెత ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రచారానికి కాదేదీ అనర్హం అన్నట్టు ఏ మాత్రం అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలో పడి మేసినట్టు ఓ వార్తకు తారా స్ధాయిలో ప్రాదాన్యతనిచ్చాయి ప్రసార మాధ్యమాలు. కాగా ఆ సంఘటనలో వాస్తవాలు గాని, నిజనిర్ధారణ గాని, లోతైన విశ్లేషణ గానీ జరపకుండానే అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ప్రచారం కల్పించారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణించే వాహన శ్రేణులకు వేగంలో ఏమాత్రం పరిమితులు ఉండవు. వేగం సంబంధించిన నియమాలను అతిక్రమించినందుకు సీఎం కారుకు జరిమానా అంటూ చిత్ర విచిత్ర ప్రచారం జోరుగా సాగింది.

ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాలు, వేగం, ఎవరెవరు సీఎం వెంట ఉంటారు, ఎంత సమయంలో గమ్య స్ధానాన్ని చేరుకోవాలి, ట్రాఫిక్ ను ఎన్ని నిమిషాలు నియంత్రించాలి అనే అంశాలు ముందుగానే నిర్ధిశించబడతాయి. వాటికనుగుణంగానే సీఎం కాన్వాయ్ దూసుకెళ్తుంది. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని పతాక స్థాయిలో ప్రచారం కల్పించడం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అతి వేగంగా వెళ్తే సీఎం కాన్వాయ్‌పై కూడా చలాన్లు వేస్తారనే ఉత్తిత్తి వార్తను సీరియస్ అంశంగా చిత్రీకరించే ప్రయత్నం జరగడం విడ్డూరంగా పరిణమించింది.