సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు కేరాఫ్‌.. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు కేరాఫ్‌.. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం

ప్రజారోగ్యం విషయంలో రాజీపడేది లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. కరోనా చికిత్స కోసం ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను బుధవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టిమ్స్‌లో నాలుగురోజుల్లో ఐపీ సేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు. చండీగఢ్‌లోని పీజీ కాలేజీ తరహాలో టిమ్స్‌ పీజీ కాలేజీ కూడా వైద్యులను అందించబోతున్నదని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు టిమ్స్‌ కేరాఫ్‌ అడ్రస్‌ కావాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. కార్పొరేట్‌ దవాఖానల్లో లేని హంగులు టిమ్స్‌లో ఉన్నాయని, ఇంతటి అత్యాధునిక దవాఖాన మరెక్కడాలేదని చెప్పారు. టిమ్స్‌లో 1,224 పడకలు ఉండగా, 1,000 ఆక్సిజన్‌ పడకలు, 50 వెంటిలేటర్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 15 ఫ్లోర్లు సిద్ధం అయ్యాయని, సెల్లార్‌లో క్యాంటీన్‌ ఉంటందని, రోగులకు భోజనం అందిస్తామని తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీ స్‌, ల్యాబ్‌, మిగిలిన 13 ఫ్లోర్లలో రోగులకు పడకలు ఏర్పాటుచేశామని వివరించారు. రెండురోజుల్లో సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో ఆరోగ్యరంగంలో అభివృద్ధి సాధించామని, అనేక సంస్కరణలు తెచ్చామని చెప్పారు. కేరళ, తమిళనాడు తర్వాత ఆరోగ్యరంగంలో దూసుకుపోతున్నామన్నారు.

వైద్య సిబ్బంది మనోైస్థెర్యం దెబ్బతీయొద్దు

ప్రభుత్వంపై బురదచల్లడం మానాలని మంత్రి ఈటల ప్రతిపక్షాలకు హితవుపలికారు. గాంధీలో వేలమందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అక్కడి డాక్టర్లు, సిబ్బంది మనోైస్థెర్యం దెబ్బతీయవద్దని విజ్ఞప్తిచేశారు. సోషల్‌మీడియాలో కామెంట్లు పేషెంట్లకు నష్టంచేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. అన్నీతామై సేవ చేస్తున్న సిబ్బందిని అవమానించడం తగదన్నారు. బాధ్యత లేనివారు దుష్ప్రచారాలు చేస్తున్నారని, హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే యత్నంచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాటిని నమ్మవద్దని కోరారు. 

అంతిమ సంస్కారాలను అడ్డుకోవద్దు

వైరస్‌తో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాలను కొన్నిచోట్ల అడ్డుకోవడంపై మంత్రి ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. ఇది హేయమైన చర్య అన్నారు. సాటి మనిషి చనిపోతే ఇటువంటి స్పం దన సక్రమమైందికాదని హితవుపలికారు. చనిపోయిన మనిషిలో వైరస్‌ ఉన్నా అది మరొకరికి సోకదని పలు నివేదికలు స్పష్టంచేశాయని గుర్తుచేశారు. మృతదేహాన్ని కాల్చిన తర్వాత వైరస్‌ బతికి ఉండే అవకాశం లేదన్నారు. గాంధీ దవాఖానలో కరోనా చికిత్సకోసం చేర్పించిన వయోవృద్ధులను వారి పిల్లలు తిరిగి ఇండ్లకు తీసుకుపోవటానికి ముందుకు రావడం లేదన్న ఈటల.. ఇదే మానవత్వమని ప్రశ్నించారు. పక్క ఇంటిలో కరోనా ఉన్నా భయపడవద్దని, అది మీకు సోకదని చెప్పారు.