కేటీఆర్‌కు నోటీసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

కేటీఆర్‌కు నోటీసులు..

హైదరాబాద్ శివారులోని జన్వాడలో జీవో 111ని ఉల్లంఘించి అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారంటూ మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనం మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రేవంత్ పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే కేటీఆర్ ఫాంహౌస్ నిర్మాణాలు అక్రమమా.. సక్రమమా అన్నది తేల్చేందుకు నిజ నిర్దారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ రిజిస్ట్రీ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ల సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. రెండు నెలల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
కాగా,జన్వాడలో నిబంధనలకు విరుద్దంగా కేటీఆర్ ఫాంహౌస్ నిర్మాణం చేపట్టారంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం కాంగ్రెస్ నేతలంతా కేటీఆర్ ఫాంహౌస్‌కు ర్యాలీగా బయలుదేరి నిరసన కూడా తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలతో కేటీఆర్ ఫాంహౌస్‌ ద‌ృశ్యాలను చిత్రీకరించారన్న ఆరోపణలతో.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు.
అంతకుముందు హైదరాబాద్ శివారులోని గోపన్ పల్లిలో దళితుల భూమిని కబ్జా చేశారంటూ రేవంత్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ కేటీఆర్ ఫాంహౌస్‌పై వివాదం సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద కేటీఆర్ ఫాంహౌస్‌పై ఎన్‌జీటీ నిజ నిర్దారణ కమిటీని వేయడంతో ఏం తేలబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.