తెలంగాణపై కేంద్రం నజర్: లవ్ అగర్వాల్ అండ్ టీమ్: ఆ రెండు రాష్ట్రాల్లో: ఈటెల విమర్శల తరువాత - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

తెలంగాణపై కేంద్రం నజర్: లవ్ అగర్వాల్ అండ్ టీమ్: ఆ రెండు రాష్ట్రాల్లో: ఈటెల విమర్శల తరువాత

కరోనా వైరస్ వల్ల తెలంగాణలో నానాటికీ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. అధ్వాన్నంగా మారుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కరోనా వైరస్ వ్యాప్తికి హాట్‌స్పాట్‌లా మారింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు మరింత సమస్యాత్మకంగా తయారయ్యాయి. కేసీఆర్ సర్కార్ ఎన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ విస్తరణ తీవ్రతలో, కేసుల సంఖ్యలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు.
ఈ తరహా పరిస్థితులు ఒక్క తెలంగాణలోనే కాదు.. మహారాష్ట్ర, గుజరాత్‌లల్లోనూ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించబోతోంది. 26 నుంచి 29వ తేదీ వరకు ఈ బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటించబోతోంది. దీనికి కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తారు. ఏ తేదీల్లో ఏ రాష్ట్రంలో పర్యటిస్తారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొద్దిరోజుల కిందటే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడి హోదాలో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఘాటు విమర్శలు చేశారు. పలు ఆరోపణలనూ గుప్పించారు. బీజేపీ నాయకులకు కనీసం కంటైన్‌మెంట్ జోన్ అనే పదానికి అర్థం కూడా తెలియదని విమర్శించారు.
గుజరాత్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించగలరా? అని నిలదీశారు. తాము ఆర్డర్ చేసిన వెంటిలేటర్లు, ఇతర పరికరాలను కోల్‌కతకు తరలిస్తున్నారనీ మండిపడ్డారు. ఈటెల రాజేందర్ విమర్శలను సంధించిన తరువాత.. కేంద్ర ప్రతినిధుల బృందం తెలంగాణకు రాబోతుండటం ఇదే తొలిసారి. ఫలితంగా- తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదననలు, డిమాండ్లను కేంద్ర బృందం ముందు ఉంచుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.