హైదరాబాద్‌లో మరోసారి ఫుల్ లాక్‌డౌన్ తప్పదా?: కేసీఆర్ ప్రకటిస్తారంటూ తలసాని కీలక వ్యాఖ్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

హైదరాబాద్‌లో మరోసారి ఫుల్ లాక్‌డౌన్ తప్పదా?: కేసీఆర్ ప్రకటిస్తారంటూ తలసాని కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మరోసారి లాక్‌డౌన్ కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగర పరిధిలో పూర్తి లాక్‍డౌన్ మళ్లీ విధించాలా? లేదా అన్న అంశంపై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లోపు సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతేగాక, లాక్‌డౌన్ అంశంపై సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. కరోనా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. కేంద్రం ఇచ్చిన సడలింపులను తాము అమలు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.
కాగా, లాక్‌డౌన్ సడలింపుల అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సగటున సుమారు 100 కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బయటికి రావడం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం లాంటి చర్యలతో కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.