కవితక్క బైలెల్లింది... బాస్ ఈజ్ బ్యాక్.. మరో ఉద్యమానికి సిద్దం... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 26, 2020

కవితక్క బైలెల్లింది... బాస్ ఈజ్ బ్యాక్.. మరో ఉద్యమానికి సిద్దం...

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎంపీ కవిత రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. ఆఖరికి బతుకమ్మ వేడుకలు కూడా ఇంట్లోనే జరుపుకున్నారు. పదవి దూరమైనంత మాత్రానా ప్రజల్లో ఉండరా అన్న విమర్శలు ఆమె పట్ల వినిపించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను రాజ్యసభకు పంపించి కేంద్ర రాజకీయాల్లో యాక్టివ్ చేయనున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాలేదు. చివరకు నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఆమె నామినేషన్ వేశారు. కరోనా కారణంగా... ఎన్నిక వాయిదా పడినప్పటికీ... రేపో మాపో కవిత ఎమ్మెల్సీ కావడం ఖాయమే. అంతేకాదు,రీఎంట్రీకి తగ్గట్టు బలమైన కార్యాచరణతో ఆమె ముందుకు రానున్నారు.
మోదీ సర్కార్ ఇటీవల దేశవ్యాప్తంగా 41 బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని సింగరేణి కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అనుబంధ సంస్థ,సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణిలో సమ్మె,నిరసనల ద్వారా కేంద్రానికి తమ వ్యతిరేకత వినిపించాలని టీబీజీకేఎస్ భావిస్తోంది. ఇందుకు కవిత సారథ్యం వహిస్తే.. సింగరేణి కార్మికుల గొంతును మరింత బలంగా వినిపించవచ్చునని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో చర్చలు జరపడం,అందుకు ఆమె అంగీకారం తెలపడం జరిగిపోయాయి.
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు(జూన్ 26) సింగరేణివ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కవిత పిలుపునిచ్చారు. అలాగే జులై 2న 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. ఆరోజు హైదరాబాద్ సింగరేణి భవన్ వద్ద నిరసన దీక్షలో ఆమె పాల్గొంటారు. రీఎంట్రీతోనే కవిత బొగ్గు గని ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడం ఆమెకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్న ఆమెకు.. ఈ కార్యాచరణ ద్వారా మళ్లీ పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.