కొత్తగా 1590 కేసులు.. కేసీఆర్ ఎక్కడ.. ఫామ్ హౌస్‌కు కరోనా రావాలని ఎంపీ శాపం... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 06, 2020

కొత్తగా 1590 కేసులు.. కేసీఆర్ ఎక్కడ.. ఫామ్ హౌస్‌కు కరోనా రావాలని ఎంపీ శాపం...

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మొన్నటిదాకా వెయ్యికి పైగా నమోదైన కేసులు... గత 3 రోజులుగా 1500 దాటడం గమనార్హం. ఆదివారం(జూలై 5) రాష్ట్రంలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1277 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 7 మంది మృతి చెందారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,902కి చేరింది. ఇప్పటివరకూ 12,703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా... ప్రస్తుతం 10.904 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల్లో ఇవాళ నమోదైన కేసులను పరిశీలిస్తే... మేడ్చల్ 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23 సంగారెడ్డి 19, మహబూబ్ నగర్ 19, నల్లగొండ 14 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా నియంత్రణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దారుణంగా వైఫల్యం చెందారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే... మన రాష్ట్రంలో లక్ష మాత్రమే చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్,ఢిల్లీ ప్రభుత్వాలను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా కరోనా ట్రీట్‌మెంట్‌కు వాడుతున్నారని... తెలంగాణలో మాత్రం కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందట్లేదని ఆరోపించారు.రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచకుండా వైరస్ వ్యాప్తికి కేసీఆరే కారణమయ్యారని కోమటిరెడ్డి ఆరోపించారు. పైన దేవుడు అంతా చూస్తున్నాడని... ఫామ్ హౌస్‌లో దాక్కున్నంత మాత్రాన కరోనా అక్కడికి రాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు కూడా కరోనా వస్తుందని,ఇది తన శాపమని అన్నారు. ఇకనైనా రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచాలని... లేదంటే ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని హెచ్చరించారు. కరోనా నియంత్రణ,సహాయక చర్యల కోసం వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయని కోమటిరెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రజలు,మేదావులు,విద్యావంతులు కేసీఆర్ వైఖరిని గమనించాలన్నారు.