మళ్లీ రంగంలోకి కల్నల్ సంతోష్ టీమ్.. సహచరుడికే ‘16బిహార్’ బాధ్యతలు.. తండ్రిని కోల్పోయిన బిడ్డల్లా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 01, 2020

మళ్లీ రంగంలోకి కల్నల్ సంతోష్ టీమ్.. సహచరుడికే ‘16బిహార్’ బాధ్యతలు.. తండ్రిని కోల్పోయిన బిడ్డల్లా..

45 ఏళ్ల తర్వాత చోటుచేసుకున్న నెత్తుటిపాతాన్ని గుర్తుచేసుకుంటూ.. మాతృభూమి కోసం ప్రాణాలొడ్డిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ.. గాల్వాన్ లోయలో బీహార్ 16వ రెజిమెంట్ కదంతొక్కుతోంది.. బాబు స్థానంలో ఆయన సహచరుడే కమాండింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టగా... నాటి ఘర్షణలో గాయపడి, ఆస్పత్రుల్లో కోలుకున్న సైనికులు మళ్లీ ఫ్రంట్ లైన్ లో విధులకు హాజరయ్యారు..తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ 14)వద్దజూన్ 15న రాత్రివేళ.. భారత్, చైనా బలగాలు హింసాత్మక ఘర్షణకు దిగాయి. నాటి ఘటనలో మనవాళ్లు మొత్తం 20 మంది చనిపోయారు. అందులో 16వ బీహార్ రెజిమెంట్ కు చెదిన కల్నల్ సంతోష్ బాబు సహా ఆ యూనిట్ లోని 12 మంది జవాన్లు, ఆర్టిలరీ రెజిమెంట్ కు చెందిన ముగ్గురు, 12వ బిహార్ రెజిమెంట్ కు చెందిన ఒక జవాన్, మౌంటెయిన్ సిగ్నల్ యూనిట్ కు చెందిన మరొక జవాన్ ఉన్నారు. ఘర్షణల్లో గాయపడ్డ జవాన్లు రెండు వారాల తర్వాత మళ్లీ విధుల్లోకి చేరడంతో గాల్వాన్ లోయలో ఉత్తేజపూరిత వాతావరణం నెలకొంది. వారంతా లేహ్ లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందడం తెలిసిందే.
జూన్ 15 ఘటన జరిగే నాటికే 16వ బీహార్ రెజిమెంట్ లో సంతోష్ సహచరుడైన ఓ అధికారికి కల్నల్ గా ప్రమోషన్, వేరే ప్రాంతానికి పోస్టింగ్ కూడా ఖరారైంది. అయితే, ఘర్షణల తర్వాత ఆర్మీ ఉన్నతాధికారులు తీవ్రంగా సమాలోచనలు జరిపి.. కల్నల్ బాబు స్థానాన్ని భర్తీ చేసే విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గాల్వాన్ పై పట్టు కొనసాగించేలా సంతోష్ బాబు టీమ్ లో ప్రమోషన్ పొందిన ఆ అధికారినే 16వ బీహార్ రెజిమెంట్ కు కమాండింగ్ ఆఫీసర్ గా నియమించారు. భద్రతా కారణాల రీత్యా ఆ అధికారి పేరును గోప్యంగా ఉంచారు.