భయపెడుతున్న లెక్కలు.. తెలంగాణలో కొత్తగా 1892 కరోనా కేసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 04, 2020

భయపెడుతున్న లెక్కలు.. తెలంగాణలో కొత్తగా 1892 కరోనా కేసులు..


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. నిన్న,మొన్నటిదాకా వెయ్యికి పైగా కేసులు నమోదవగా... నేడు ఆ సంఖ్య 2వేలకు దగ్గరగా చేరింది. శుక్రవారం(జూలై 3) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1658 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 8 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,462కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 283కి చేరింది. ఇప్పటివరకూ 10,195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా... ప్రస్తుతం 9,984 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.తెలంగాణ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త గొంగిడి మహేందర్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా... ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని,ఆలేరు నియోజకవర్గ ప్రజలు,కార్యకర్తలు,అభిమానులు ఆందోళన చెందవద్దని సునీత విజ్ఞప్తి చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయ,ఆలేరు ప్రజల అభిమానంతో త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,బాజిరెడ్డి గోవర్దన్,బిగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హోంమంత్రి మహమూద్ అలీ,డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా కరోనా బారినపడ్డారు. కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు,గూడూరు నారాయణ రెడ్డి కరోనా బారినపడగా... వీహెచ్ కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.