గాంధీ నుంచి ప్రతీరోజూ 20-25 డెడ్ బాడీస్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

గాంధీ నుంచి ప్రతీరోజూ 20-25 డెడ్ బాడీస్..

ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఓ కౌన్సిలర్ ప్రాణాలను కాపాడుకోలేకపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా స్వయంగా తానే ఎంత ప్రయత్నించినా.. ఎక్కడా ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్స్ దొరకలేదన్నారు. ఐదు రోజులుగా బెడ్స్ కోసం గౌసియా బేగం అనే ఆ కౌన్సిలర్ తిరగని ఆస్పత్రి లేదన్నారు. ఎక్కడికెళ్లినా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోందని... చివరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. అక్కడ ఆక్సిజన్ అందక ఆమె చనిపోయిందని వాపోయారు. ఈ మేరకు జగ్గారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు.
ఒక ఎమ్మెల్యేని అయిన తనకే ఎంత ప్రయత్నించినా బెడ్స్ దొరక్కపోతే... ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో ఎవరికైనా కరోనా వస్తే...ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. అక్కడ ఆక్సిజన్,వెంటిలేటర్ అందించే సౌకర్యం లేదన్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడే తిరుగుతున్న మంత్రి హరీష్ రావు దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. అదృష్టం బాగుండి కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారికే హరీశ్ రావు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని... ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండ్‌తో రివ్యూ మీటింగ్ నిర్వహించి అవసరమైన మెడికల్ ఏర్పాట్లు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.
సంగారెడ్డిలో ప్రజలు సరైన వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతుంటే... ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నట్లు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నీకేమైనా ఆలోచన, పట్టింపు ఉందా అని ప్రభాకర్ రెడ్డిని నిలదీశారు. రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలనా సాగుతోందన్నారు. ఇంగిత జ్ఞానం లేని మంత్రి,ఎంపీలతో ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. రైతు బంధు కింద ఇచ్చే రూ.5వేలకు ఆశపడి ఓట్లు వేసినందుకు... ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు... తానే ఒక సాక్ష్యం,తానే ఒక రుజువు అని చెప్పారు. ఒక కౌన్సిలర్‌ను కాపాడుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రతీరోజూ 20,25 మృతదేహాలు వెళ్తున్నాయని... కానీ ఏ పేపర్‌లో,టీవీలో ఆ విషయాలను చెప్పట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు.