2030 వరకు నరేంద్ర మోడీనే ప్రధాని: రాంమాధవ్, కేసీఆర్ చెప్పుకోవడానికి అదొక్కటే..! - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

2030 వరకు నరేంద్ర మోడీనే ప్రధాని: రాంమాధవ్, కేసీఆర్ చెప్పుకోవడానికి అదొక్కటే..!

కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని, అయితే, కేంద్రం చూపిన శ్రద్ధ రాష్ట్రాలు చూపిస్తేనే ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టగలమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో బీజేపీ జనసంవాద్ వర్చువల్ సభలో ఆయన మాట్లాడారు.
కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాంమాధవ్ అన్నారు. పాలనలోనూ, కరోనా నివారణ విషయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.
కరోనా బారిన పడుతున్న ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని రామ్ మాధవ్ ప్రశ్నించారు. సగం పూర్తయిన కాళేశ్వరం తప్ప.. చూపించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే దేశ సమగ్రత, మహిళల హక్కులు, రైతుల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు.
70 ఏళ్లలో సాధ్యం కాని ఆర్టికల్ 370ని కేవలం 70 గంటల్లోనే రద్దు చేసిన ఘనత ప్రధానిదేనని రాంమాధవ్ వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకోవడం లేదని, పోరాటాలే చేస్తున్నామని చెప్పారు. 2030 వరకు కూడా ప్రధానిగా నరేంద్ర మోడీనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.