కోవిడ్ ఆసుపత్రిగా పాత సచివాలయం: 3 వేల పడకలతో: కిషన్ రెడ్డి సూచనకు కేసీఆర్ స్పందిస్తారా? - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 05, 2020

కోవిడ్ ఆసుపత్రిగా పాత సచివాలయం: 3 వేల పడకలతో: కిషన్ రెడ్డి సూచనకు కేసీఆర్ స్పందిస్తారా?

కరోనా వైరస్ తెలంగాణను కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నియంత్రించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుందనే అంశంపై ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. దేశంలోనే అత్యంత తక్కువ స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించిన రాష్ట్రంగా ఇప్పటికే ఓ అవాంఛనీయ గుర్తింపును పొందిన తెలంగాణలో రోజురోజుకూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తరహాలో తెలంగాణ కూడా డేంజర్‌జోన్‌లో వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో ఈ తరహా పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో బాటు హైదరాబాద్ డేంజర్‌జోన్‌లో ఉందని హెచ్చరించారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఫలితంగా అతి తక్కువ పరీక్షలను చేసిన రాష్ట్రంగా ఎవరూ కోరుకుని రికార్డును నెలకొల్పిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ బాంబుపై హైదరాబాద్ ఉందని, అది ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కరోనాను నియంత్రించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పెద్దఎత్తున సహాయం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. పాత సచివాలయాన్ని కూల్చివేయకుండా దాని కోవిడ్ ఆసుపత్రిగా మార్చుకోవాలని సూచించారు. పాత సచివాాలయాన్ని కోవిడ్ ఆసుపత్రిగా మార్చుకోవడం వల్ల కనీసం మూడువేల పడకలను అందుబాటులోకి తీసుకుని రావచ్చని అన్నారు.