హైదరాబాద్‌లో మరోసారి లాక్ డౌన్... భిన్నంగా స్పందించిన మంత్రి సబిత... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 01, 2020

హైదరాబాద్‌లో మరోసారి లాక్ డౌన్... భిన్నంగా స్పందించిన మంత్రి సబిత...

హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే దిశగా తెలంగాణ సర్కార్ కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నగరంలో 15 రోజుల లాక్ డౌన్‌ విధించే అవకాశం ఉందన్నారు. దీనిపై జూలై 1 లేదా 2 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే ఇంతవరకూ భేటీ జరిగే తేదీపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇంతలోనే మరో మంత్రి లాక్ డౌన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ అమలు చేయడం పరిష్కారం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే... చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని అన్నారు. తగిన జాగ్రత్తలు,నిబంధనలు పాటిస్తూ కరోనాను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం(జూన్ 30) హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి హరితహారంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల చెస్ట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రవి అనే యువకుడు మృతి చెందిన ఘటన ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కోల్పోయేలా చేసింది. మంత్రి ఈటల మాత్రం ఒకరిద్దరు చనిపోయినంత మాత్రానా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నియంత్రణలో పూర్తిగా చేతులెత్తేశారని... ప్రజల గురించి పట్టించుకోవాల్సిన సమయంలో హరితహారంకు తొందరేమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వైరస్ నియంత్రణలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపిస్తున్నారు.