అవసరమైన వారందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 12 ప్రభుత్వ దవాఖానల్లో కేంద్రాలు ఏర్పాటుచేసి కొవిడ్ నిర్ధారణ కోసం నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు ఆయా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అక్కడ విధిగా భౌతికదూరం పా టించాలని సూచించారు. పాజిటివ్ వచ్చినవారు తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండాలని, వీరికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్‌సెంటర్ నుంచి ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్నవారి దగ్గరకు వైద్యులను పంపించాలని సూచించారు. మంగళవారం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. టిమ్స్ దవాఖాన కోసం ఎంపికైన సిబ్బంది బుధవారం విధుల్లో చేరుతారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టిమ్స్, గాంధీ దవాఖానల్లో అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇంకా అవసరం ఉన్నవారిని ఎంపికచేయాలని ఈటల ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టెర్షరీ కేర్ దవాఖానల వరకు అవసరమైన పరికరాల కొనుగోలుపై సమీక్షించిన ఆయన.. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. పరికరాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్ మొదలైనందున అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఏ ఒక్క దవాఖానలో కూడా మందులు లేవనే మాట రావొద్దని తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డికి సూచించారు.
రోగులకు మెడికల్ కాలేజీల్లో చికిత్స..
దవాఖానలో చేరిన ప్రతి పేషెంట్ దగ్గరకు డాక్టర్, నర్సు తప్పకుండా వెళ్లి రోజుకు మూడుసార్లు పరీక్ష చేయాలని, పేషెంట్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్డర్ రమేశ్‌రెడ్డిని మంత్రి ఈటల ఆదేశించారు. కొవిడ్ రోగులను చేర్చుకునేందుకు అన్ని జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను సిద్ధంచేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని దవాఖానల మీద భారం పడకుండా అక్కడే చికిత్స అందించేలా చూడాలని కోరారు. కాళోజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. వాటి సన్నద్ధతపై రోజూ నివేదిక అందజేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వైలెన్స్ పెంచాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని సూచించారు. కరో నా పాజిటివ్ ఉన్న వ్యక్తిని ఎంత తొందరగా గుర్తిస్తే, అంత సమర్థవంతగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు.