కరోనాతో సహజీవనం, ఎన్ని ఉద్యోగాలు పోతాయో.: మరణాలు దాచలేమంటూ కేటీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

కరోనాతో సహజీవనం, ఎన్ని ఉద్యోగాలు పోతాయో.: మరణాలు దాచలేమంటూ కేటీఆర్

కరోనా మహమ్మారితో మనమంతా సహజీవనం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశమే లేదన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు మొత్తం లాక్‌డౌన్ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.
కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ.. ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇంకా ఎక్కువ కాలం లాక్‌డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని అన్నారు. అందరికీ జీవితం, జీవనోపాధి ముఖ్యమని తెలిపారు.
కరోనాతో సహజీనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే కంటే.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 23వేల కేసులు వెలుగుచూస్తే.. మరణాలు 300 వరకే నమోదయ్యాయని తెలిపారు. అయినా కొంతమంది ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.