డైలామాలో కేసీఆర్... జనాల్లో కన్ఫ్యూజన్... హైదరాబాద్‌లో లాక్ డౌన్‌‌పై కీలక అప్‌డేట్స్... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

డైలామాలో కేసీఆర్... జనాల్లో కన్ఫ్యూజన్... హైదరాబాద్‌లో లాక్ డౌన్‌‌పై కీలక అప్‌డేట్స్...

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గత రెండు వారాలుగా 900కి కాస్త అటు ఇటుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై రెండు,మూడు రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారన్న కథనాలు వచ్చాయి. జూన్ 1 లేదా 2 తేదీల్లో కేబినెట్ సమావేశం ఉండవచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటికీ కేబినెట్ భేటీపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ప్రజలకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సేఫ్ కాదని భావిస్తున్నవాళ్లు గ్రామాలకు తరలిపోతున్నారు. ఇక్కడే ఉండాలనుకున్నవాళ్లు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎలాంటి పంథా అనుసరించాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా గజ్వేల్‌లోని తన ఫామ్ హౌజ్‌లో ఐఏఎస్‌లు,వైద్యా నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించిన చెన్నై,బెంగాల్‌లో పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల్లోనూ మరోసారి లాక్ డౌన్ విధించిన దేశాల్లో... ఆ తర్వాత ఎలాంటి ఫలితం కనిపించిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ హైదరాబాద్‌లో లాక్ డౌన్ విధిస్తే రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.. ఒకవేళ లాక్ డౌన్ విధించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ చర్చోపచర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 55 రోజుల లాక్ డౌన్ పీరియడ్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం చాలావరకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది తలెత్తడంతో 50శాతం వేతనాలతోనే సరిపెట్టారు. అన్‌లాక్ 1.0 తర్వాత హైదరాబాద్ నుంచి ఆదాయం రావడం మొదలవడంతో... రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడింది. జూలై నెలకు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్రేటర్ పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే ఆదాయం పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న రెవెన్యూ,ఎక్సైజ్ యాక్టివిటీస్ పూర్తిగా నిలిచిపోతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తితే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి లాక్ డౌన్ పెట్టాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.