‘మీ చుట్టూ పరిసరాల్లో ఏమైనా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా? మీ కండ్ల ముందే అవి కబ్జాకు గురవుతున్నాయా? అయితే స్పందించండి. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఒక్క సమాచారం ఇవ్వండి. సర్కారు ఆస్తుల పరిరక్షణలో భాగస్వాములు కండి’ అని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూకబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు సర్కారు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతర కార్యక్రమాలు చేపట్టినా వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు లేదా సమాచారం అందించేందుకుటోల్ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చింది. ఆదివారం ప్రగతిభవన్‌లో మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు 1800-599-0099 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించారు. నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగస్థలాల రక్షణకు ప్రజలు ప్రభుత్వంతో కలిసిరావాలని కోరారు. జీహెచ్ఎంసీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రత్యేకంగా అసెట్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటుచేసింది. దీనిలోభాగంగా టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే విచారణ
ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా టోల్‌ఫ్రీ నంబర్‌కు పౌరులు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చు. ఎవరైనా ఫిర్యాదు లేదా సమాచారం అందిస్తే వెంటనే అది ప్రత్యేకమైన ఫిర్యాదుగా నమోదవుతుంది. ప్రతి సమాచారం లేదా ఫిర్యాదుకు ఒక విశిష్ట సంఖ్యను అధికారులు కేటాయించనున్నారు. ఈ సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకునే వీలుంటుంది. ప్రజలు ఫిర్యాదుచేసిన వెంటనే ఎన్ఫోర్స్మెంట్ సహాయ అధికారికి సమాచారం వెళ్తుంది. ఆయన విచారణ ప్రారంభిస్తారు. చెరువులు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను కబ్జాలనుంచి కాపాడేలా చర్యలు చేపడుతారు.
ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ఫిర్యాదు ఇచ్చే వ్యక్తి ఇష్టానుసారం.. వివరాలు గోప్యత పాటించే వెసులుబాటు కల్పించారు. ఈ సెల్ అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనున్నది. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.