దీర్ఘకాలిక రోగులకు కరోనా యమపాశం.. వారికి వైరస్ సోకితే ప్రాణాలు పోతాయనే భయం చాలామందిలో ఉన్నది. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తూ, వైద్యుల సూచనలు అనుసరిస్తే వైరస్‌ను జయించవచ్చని రాష్ట్రంలో రుజువైంది. షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలున్నవారు సైతం రాష్ట్రంలో కరోనా బారినుంచి బయటపడుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి వ్యాధులున్నవారు 2,500 మందికిపైగా వైరస్ బారినపడగా, 90 శాతం మంది కోలుకున్నారు. 203 మంది మరణించారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు సైతం కరోనా నుంచి గట్టెక్కుతున్నారు. ఇతర వ్యాధులతో సతమతమవుతున్నవారు కరోనా సోకితే ప్రాణాలకు ప్రమాదమని చాలామంది భయపడుతున్నారు. రాష్ట్రంలో బుధవారంనాటికి వైరస్ సోకిన మొత్తం 17 వేల మందికిపైగా ఉండగా, వీరిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు 2,500 మందిపైగా ఉన్నారు. వీరంతా గాంధీ దవాఖానలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువగా కనిపించే సమస్య షుగర్, బీపీ. అయినప్పటికీ చికిత్స ద్వారా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. 94 శాతం మందికి షుగర్, 89 శాతం మందికి బీపీ ఉన్న బాధితులు కూడా వైరస్‌పై విజయంసాధిస్తున్నారు. దీర్ఘకాలివ్యాధులు ఉండి కరోనా సోకినవారిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారిస్తూ చికిత్స అందిస్తున్నారు. నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ, అవసరమైన మందులు, పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి భరోసా ఇస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉండి కూడా ఎలాంటి లక్షణాలు లేనివారు వైద్యుల సూచనలు అనుసరిస్తూ హోంక్వారెంటైన్లో ఉండి వైరస్‌ను జయిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి సాధారణ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న కరోనా బాధితులు ధైర్యంగా పోరాటం చేస్తున్నారు.