ఉత్తర కొరియా లో అత్యవసర పరిస్థితి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

ఉత్తర కొరియా లో అత్యవసర పరిస్థితి


కెసోంగ్: ఉత్తర కొరియాలో కరోనా కలకలం నెలకొన్నది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం అత్యవసర పరిస్థితి విధించారు. సరిహద్దు నగరమైన కెసోంగ్ కు చెందిన ఒక వ్యక్తి మూడేండ్ల కిందట దక్షిణ కొరియాకు పారిపోయాడు. కాగా అతడు ఈ నెల 19న సరిహద్దుగుండా అక్రమ మార్గంలో తిరిగి వచ్చాడు. మరోవైపు అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో ఉత్తర కొరియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అలాగే అతడిని కలిసిన వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదివారం అత్యవసర పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించారు. సరిహద్దు నగరమైన కెసోంగ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించడంతోపాటు అక్కడ లాక్‌డౌన్‌ను విధించారు. అలాగే సరిహద్దు నుంచి ఆ వ్యక్తి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడంపై మిలిటరీ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అన్నది అధికారులు స్పష్టం చేయలేదు. ఒకవేళ అలా ప్రకటిస్తే ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైనట్లవుతుంది. తమ దేశం కరోనా రహితమని, తమ చర్యల వల్ల ఒక్క వైరస్ కేసు కూడా నమోదు కాలేదని పలు సందర్భాల్లో కిమ్ పేర్కొన్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )