గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే వాదనలు మొదటి నుంచీ ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ డబ్ల్యూహెచ్‌వో కొట్టిపారేస్తూనే ఉన్నది. తాజాగా 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం గాలి ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందని స్పష్టం చేసింది. ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌వో) లేఖ రాశారు. అంతేకాకుండా.. వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే సవరించాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు సూచించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ శాస్త్రవేత్తలు వచ్చేవారం ఓ జర్నల్‌లో తమ లేఖతోపాటు ఆధారాలను ప్రచురించాలని భావిస్తున్నారు. గాలిలో సూక్ష్మ పరిమాణంలో ఉండే ధూళి కణాల ద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నదని వీరు వాదిస్తున్నారు. రోగి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్‌ బయటికి వచ్చి.. గాలిలోని సూక్ష్మ కణాలపైకి చేరుతున్నదని చెప్పారు.
ఈ కణాలు ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్‌ను వ్యాపింపజేస్తున్నాయన్నారు. అయితే ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌వో ఇంతవరకూ స్పందించలేదు. గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనలే రాగా.. డబ్ల్యూహెచ్‌వో కొట్టిపారేసింది. తుంపర్ల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నది. ఐదు మైక్రాన్ల పరిమాణం ఉండే తుంపర్ల ద్వారా మాత్రమే గాలిలో కరోనా వైరస్‌ ప్రయాణిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వాదన నిజమైతే.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గాలిని సైతం శుద్ధి చేసి వాడుకునే పరిస్థితులు తలెత్తవచ్చు.