ఇక్కడ వేలమంది జీవితాలే పోతున్నాయి ప్రైవేటు పాఠశాలలపై హైకోర్టు ఆగ్రహం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 04, 2020

ఇక్కడ వేలమంది జీవితాలే పోతున్నాయి ప్రైవేటు పాఠశాలలపై హైకోర్టు ఆగ్రహం


ప్రపంచమంతా అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో స్కూల్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడానికి ఏం తొందరొచ్చిందని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు తరగతులు నిర్వహించకపోతే మిన్ను విరిగి మీద పడుతుందా? అని నిలదీసింది. ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగుతులు నిర్వహించకుండా అడ్డుకోవాలని, ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సీబీఎస్‌ఈ ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇప్పటికే రెండు నెలలుగా తరగతులు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌ సౌకర్యం సమకూర్చుకోవాలని తల్లిదండ్రులకు చెప్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు విద్యార్థుల బాగుకోసమేనని, లేకపోతే వారు విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తరగతుల నిర్వహణపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం-హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ విద్యా సంవత్సరం, తరగతుల నిర్వహణ అంశాన్ని ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌కమిటీకి అప్పగించిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని వెల్లడించారు. జూలై 31 వరకు తరగతులు నిర్వహించరాదని స్కూల్స్‌, కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అయితే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చాయని తెలిపారు తిండిలేనివారికి ల్యాప్‌టాప్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆన్‌లైన్‌ తరగతులపై అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ప్రైవేటు పాఠశాలలు ఫీజులు ఎలా వసూలు చేస్తాయని ప్రశ్నించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పాఠశాలలను నిర్వహించవద్దంటూనే ఆన్‌లైన్‌ తరగతులకు ఎలా అనుమతి ఇస్తుందని నిలదీసింది. విధానాల్లో తేడాలు ఉండటం వల్లే ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులను ఫీజులు, ల్యాప్‌టాప్‌ల కోసం వేధిస్తున్నాయని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లలకు రెండు పూటలా భోజనం పెట్టడానికే కష్టపడుతున్నారని, వారు ల్యాప్‌టాప్‌లు ఎలా కొనివ్వగలరని వ్యాఖ్యానించింది. నల్సార్‌ యూనివర్సిటీ, హైకోర్టులోనే ఇంటర్నెట్‌ సరిగ్గా ఉండదని, ఇక గ్రామాల పరిస్థితి ఏమిటని పేర్కొన్నది. ‘ఓ మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో వేలాది మంది జీవితాలే పోతున్నాయి. వలసకార్మికులు, బడుగు జీవుల జీవితాలు అంధకారంగా మారాయి. నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏమిటి? అంతెందుకు న్యాయవ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. హైకోర్టు రిజిస్ట్రీలో 20 మంది కొవిడ్‌ 19 బారినపడ్డారు. ఒకరు చనిపోయారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ వాదనలు కూడా వింటామని ధర్మాసనం పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ అంశంలో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.