ప్రణయ్ , అమృతల హత్య కేసును సినిమా - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 27, 2020

ప్రణయ్ , అమృతల హత్య కేసును సినిమా


సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. లాక్ డౌన్ సమయంలో క్లైమాక్స్ సినిమాతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం మర్చిపోక ముందే షార్ట్ ఫిల్మ్ 'నగ్నం' అంటూ షాక్ ఇచ్చాడు. నగ్నం ట్రైలర్ తోనే రచ్చ లేపిన వర్మ.. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన మిర్యాలగూడ ప్రణయ్ - అమృతల హత్య కేసును సినిమాగా రూపొందిస్తున్నట్లు ప్రకటించి మరో సంచలనానికి తెరలేపాడు. అంతేగాక అమృత అలాగే ఆమె తండ్రి మారుతి రావు పాత్రలకు సంబంధించిన లుక్స్ తో వర్మ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు 'మర్డర్: కుటుంబ కథా చిత్రం' అని టైటిల్ ఖరారు చేసాడు. ఆ పోస్టర్ చూడగానే సినిమా మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా అమృత - ప్రణయ్ లకు సంబంధించినదే అని అంతా అనుకుంటుండగా.. ఆ సినిమా కథ తన జీవితానికి సంబంధించినది కాదని ఆ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే భర్తను తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నట్లు అమృత ఒక లెటర్ విడుదల చేసింది. ఇలాంటి సమయంలో విషాదకరమైన ఘటన పై సినిమాలు చేయడం ఏమిటని అమృత లేఖలో వెల్లడించింది. ఆ వెంటనే వర్మ స్పందించి.. "సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అమృత లేదా మరెవరైనా కావచ్చు.. వారికి నా ఫైనల్ సందేశం ఇదే. విపరీతమైన బాధను అనుభవించిన వారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఇక మర్డర్ సినిమాలో ఆ బాధను అనుభవించిన వారిని గౌరవంగా చూపించడమే జరుగుతుందని చిత్తశుద్ధితో జరిగిన పరిణామాలను సినిమాలో చూపించనున్నట్లు కూడా తెలిపాడు. అలాగే ప్రణయ్ లుక్కుకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసి.. వర్మ ఈ సినిమా పై మరింత ఆసక్తి రేపాడు. ఇదిలా ఉండగా తాజాగా జులై 28న ఉదయం 9:08 గంటలకు మర్డర్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో సినీ ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తుతుంది. మరి ఆర్జీవీ మర్డర్ ట్రైలర్ తో ఎలాంటి వివాదాలకు తెరలేపనున్నాడో అని ఎదురు చూస్తున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )