పెద్దపల్లి జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్.. భారీగా మద్యం స్వాధీనం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 06, 2020

పెద్దపల్లి జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్.. భారీగా మద్యం స్వాధీనం

వాహనాలతో పాటుగా మద్యం చోరీ చేసే దొంగల ముఠాను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 8 ఇంక్లైన్ కాలనీ, పెంచికల్ పేటకు చెందిన మాడపాటి శేఖర్, రాజు, సాగర్ల గణేష్, సంతోష్ నగర్ కు చెందిన కుర్ర అంజయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పల్లెర్ల రమేష్ ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ప్రధాన నిందితుడు శేఖర్ తొలుత బంధువుల వద్ద పాలేరుగా ఉంటూనే పందులు పట్టే వృత్తి చేసేవాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను ప్రారంభించాడు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, ఎన్టీపీసీ, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మేకల దొంగతనం చేసి వాటిని తరలించేందుకు బైక్, ఆటో ట్రాలీలను సైతం దొంగలించే వాడు. పీడీ యాక్ట్ నమోదై ఏడాది జైలు శిక్ష అనుభవించినా శేఖర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రాజుతో కలిసి ముఠాగా ఏర్పడి వైన్ షాప్ లలో చోరీ చేసేందుకు పథకం పన్నారు. 
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లో గత ఫిబ్రవరి 9న వైన్ షాప్ లో దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను పంచుకున్నారు. దొంగతనాలు చేసే క్రమంలో సీసీ కెమెరాలకు ఉపయోగించే డీవీఆర్ బాక్స్ కూడా దొంగిలించి గోదావరి నదిలో పడేశారు. మే నెలలో పెద్దపల్లి టీచర్స్ కాలనీలో యునికార్న్ బైక్ దొంగతనం, జూన్ లో మంచిర్యాల రాంనగర్ లో పల్సర్ బైక్, హాజీపూర్ లో ఆటో ట్రాలీ లను దొంగతనం చేశారు. ఇటీవల జూన్ 30న పాలకుర్తి శివారులో వైన్ షాపులో రాడ్లతో షెట్టర్ కొట్టి మద్యం దొంగిలించారు. అలాగే సాగర్, గణేష్ తో కలిసి కరీంనగర్ కృష్ణా నగర్ తో పాటు పలు ప్రాంతాల్లోనూ ఆటో ట్రాలీ తో పాటు మద్యం దొంగలించారు.