తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్‌? - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 04, 2020

తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్‌?


కరోనా మహమ్మారితో గజగజలాడుతున్న ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం పంద్రాగస్టు కానుకనివ్వబోతున్నది. కోటిమందికి పైగా సోకి ఐదులక్షలకుపైగా మందిని బలిగొన్న వైరస్‌ను కట్టడిచేసే తొలి సంజీవనిని హైదరాబాద్‌ అందివ్వబోతున్నది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారం హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్‌' టీకా మందును ఆగస్టు 15న విడుదలచేసేందుకు రంగం సిద్ధం అవుతున్నది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న దవాఖానలు, వైద్య సంస్థలకు రాసినలేఖ శుక్రవారం మీడియా చేతికి అందింది. ఇదే నిజమైతే కరోనా రక్కసి అంతం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు మరో నెలన్నరలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఐసీఎంఆర్‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌' టీకామందును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభణ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనుమతులు, పరీక్షలను వేగవంతంగా పూర్తిచేయాలని బలరాం భార్గవ్‌ కోరారు. ‘బీబీవీ152 కొవిడ్‌ వ్యాక్సిన్‌' (కోవాగ్జిన్‌) క్లినికల్‌ ట్రయల్స్‌కు ఈ నెల 7వ తేదీలోగా అన్ని అనుమతులు పొందాలని ఆదేశించారు. ఆ వెంటనే పరీక్షలు ప్రారంభించి, త్వరగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకురావడంలో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేయడానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తున్నాం. దేశీయంగా తయారవుతున్న తొలి వ్యాక్సిన్‌ ఇది. దీనిని భారత ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాలు అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని పర్యవేక్షిస్తున్నాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి కృషి చేయాలి. భారత్‌ బయోటెక్‌ ఈ దిశగా పనిచేస్తున్నది. అయితే ఈ ప్రాజెక్టులో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న అన్ని చోట్ల నుంచి సరైన సహకారం అందడంపైనే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించడానికి అవసరమైన అన్ని అనుమతులను పొందే ప్రక్రియను వేగవంతం చేయాలి’ అని భార్గవ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి గడువులోగా ట్రయల్స్‌ పూర్తిచేయాలని నిర్దేశించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2కు సంబంధించి డీసీజీఐ ఇప్పటికే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. మరో నెలన్నర రోజుల్లో పరీక్షలు పూర్తయితే.. ప్రపంచంలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్‌ ఇదే కానున్నది. అయితే ఈ లేఖ పూర్తిగా అంతర్గతమని, గడువుపై ఇప్పుడే స్పందించలేమని భారత్‌ బయోటెక్‌ వర్గాలు తెలిపాయి. ఆ లేఖ తాము రాసిందేనని ఐసీఎంఆర్‌ ప్రతినిధి రజనీకాంత్‌ శ్రీవాస్తవ స్పష్టంచేశారు.