నేరుగా రైతులకు ఫోన్లు చేసిన సీఎం కేసీఆర్‌.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

నేరుగా రైతులకు ఫోన్లు చేసిన సీఎం కేసీఆర్‌..

శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం కింద ఇప్పటికే వేలమంది రైతులకు లబ్ధిచేకూరుతున్నది. 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువను ఇప్పటికే నాలుగు రిజర్వాయర్లుగా చేసి.. 34 తూముల ద్వారా చెరువులను నింపుతున్నారు. దీనిద్వారా పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగిపోయాయి. అయితే.. వరద కాలువ దిగువ  భూములకు తూముల ద్వారా నీళ్లందుతుండగా.. ఎగువ గ్రామాలకు కూడా నీళ్లివ్వాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దానిపై దృష్టి సారించారు. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మేడిపల్లి మండల రైతుబంధు సమితి జిల్లా కార్యవర్గసభ్యుడు, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి నేరుగా ఫోన్‌చేసి మాట్లాడారు.
వరదకాలువ ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలు.. రైతులకు నీళ్లందుతున్నతీరు, ఇంకా పరీవాహక ప్రాంతాల రైతుల అవసరాలు తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం భూమయ్య కథలాపూర్‌లోని విషయాలను వివరించారు. పునర్జీవ పథకంతో మండలంలోని తక్కల్లపల్లి, సిరికొండ, బొమ్మెన, కథలాపూర్‌ గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే, వరదకాలువకు ఎగువనున్న మరో 12 గ్రామాలకు లిప్టుద్వారా నీళ్లిస్తే.. ఆ గ్రామాల రైతుల కష్టాలు తీరుతాయని విజ్ఞప్తిచేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌.. పూర్తి వివరాలు మాట్లాడేందుకు రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌ రమ్మని ఆహ్వానించారని జెడ్పీటీసీ తెలిపారు.