న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది .. తెలంగాణా చరిత్రలో నేడు బ్లాక్ డే : ఉత్తమ్ కుమార్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది .. తెలంగాణా చరిత్రలో నేడు బ్లాక్ డే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ అత్యంత బాధాకరమైన రోజు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ సెక్రటేరియట్ ను కూల్చేయాలని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగేలోపే సెక్రటేరియట్ ను కూల్చివేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు న్యాయవ్యవస్థ కలుగజేసుకొని, తప్పులను దిద్దాలని, కానీ నేడు న్యాయవ్యవస్థపై నమ్మకం కూడా పోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తుంటే, ఆ సమస్యను పక్కనపెట్టి సచివాలయం కూల్చడానికి తెగ తాపత్రయ పడుతున్నాడు అని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం కనీసం కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, గ్రౌండ్ లెవెల్ లో లెక్కలకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకపక్క ఏపీలో 10 లక్షల కరోనా పరీక్షలు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష పరీక్షలు మాత్రమే చేశారని విమర్శించారు.
పక్క తెలుగు రాష్ట్రంలో సీఎం జగన్ అద్భుతంగా పని చేస్తుంటే తెలంగాణలో మాత్రం ఎందుకు టెస్ట్ లు జరగవు అని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చుకుంటే కాంగ్రెస్ ఉద్యమ బాట పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు కానీ 500 కోట్ల రూపాయలతో సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కెసిఆర్ కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిఎస్ కెసిఆర్ కి తొత్తుగా మారారని,ఆయన పదవికి అనర్హుడని పేర్కొన్నారు. 20 మందిని తొక్కి చీఫ్ సెక్రటరీగా పదవి పొందారని విమర్శించారు. గవర్నర్ పిలిస్తే వెళ్లకుండా రాజ్యాంగాన్ని అవమానించారని పేర్కొన్నారు. కెసిఆర్ చీకటి కుట్రలో పాల్గొంటున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.