కరోనాతో జాగ్రత్తలు అవసరం ! - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 19, 2020

కరోనాతో జాగ్రత్తలు అవసరం !


కరోనాతో జాగ్రత్తలు అవసరం !
సీనియర్ హోమియో డాక్టర్ దుర్గాప్రసాద్ రావు తో ప్రత్యేక ఇంటర్వ్యూ.  తనుగుల జితేందర్ రావు (యూనిటీ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి)
హైదరాబాద్ లో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ హోమియో వైద్యులు డా. దుర్గా ప్రసాద్ రావు అన్నారు. శనివారం కాచిగూడలోని తన క్లినిక్ లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి.


◆ ఈ మధ్య కోవిడ్ లక్షణాలు దాని సాధారణ లక్షణాలైన జ్వరం, దగ్గు, ఆయాసం లాంటివి లేకుండా కొన్ని క్రొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు అది నిజమేనా ?


ఇటీవల వస్తున్న కోవిడ్ కేసుల్లో విరేచనాలు ,వాంతులు మరియు తలనొప్పి లాంటి ఇతర లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీనివల్ల కోవిడ్ వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సలో కూడా ఆలస్యం అవుతుంది. ఈ లక్షణాలు ఫుడ్ పాయిజనింగ్ మరియు సీజన్ మార్పు వల్ల వచ్చే అప్సెట్ లాగా కనిపించిన కరోనా వైరస్ లక్షణాలుగా కూడా పరిగణించవచ్చు. దీని వల్ల బీపీ, షుగర్, మరియు O2 లెవల్స్ పడిపోయి అకస్మాత్తుగా రోగి కొలాప్స్ కు
 గురికావటం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే కరోనా తన జన్యు క్రమంలో మార్పు చేసుకుని మానవ శరీరంలో తన మనుగడను వ్యాప్తిని నిలబెట్టుకుంటుంది .ఈ క్రమంలోనే కోవిడ్ వ్యాధిగ్రస్తుల్లో పై కొత్త లక్షణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తేడాను గమనించి ప్రజలు , వైద్యులు అప్రమత్తంగా ఉండాలి తప్ప భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.

◆ ఇంతకీ ఈ కోవిడ్ -19 వ్యాధి ఇప్పట్లో అంతమయ్యే అవకాశం ఉందా ? వ్యాక్సిన్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుంది ? ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా అది అందరికీ ఒక రకమైన ఫలితాన్ని ప్రయోజనాన్ని చూపించగలదా ?

ఈ ప్రశ్నకు సమాధానం సందిగ్ధమే ? ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాధి ఇప్పట్లో అంతమయ్యేదీ కాదు. మనం కొంత కాలం దీనితో కలిసి జీవించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ రావటానికి సమయం సమీపంలోనే ఉందని పరిశోధకులు చెప్తున్నాకాని కచ్చితంగా ఎప్పటి వరకు వస్తుందనేది వేచి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి వారి వారి ప్రయత్నాలు ప్రారంభించారు మన భారతదేశపు ఫార్మా దిగ్గజాలైన భారత్ బయోటెక్, కాడిలా హెల్త్ కేర్ ఈ రెండు కంపెనీలు ప్రాథమిక ఫలితాలు సాధించి దాదాపు 1000 మంది జనాభా మీద క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఐ.సి.ఎం.ఆర్ ద్వారా ఆమోదింపబడినవి, తొలి దశలో వచ్చే వ్యాక్సిన్ తీసుకున్న వారందరిలో ఫలితాలు ఒకే రకంగా ఉంటాయా లేదా అన్నది కూడా సందేహమే ?

◆ కోవిడ్ వ్యాధికి హోమియోపతి వైద్యంలో నివారణ కానీ చికిత్స గానీ ఉందా ?

హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అంటువ్యాధులకు నివారణ మందులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ రాకుండా కూడా ప్రివెంటివ్ మెడిసిన్ వాడకంలో ఉంది ప్రారంభంలోనే భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు ఆర్సెనికం ఆల్బం - 30 అనే హోమియో మందును కోవిడ్ వ్యాధికి నివారణగా సిఫార్స్ చేసింది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తి బలోపేతం కావడానికి దోహద పడి తద్వారా వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది గతంలో కూడా మన దేశంలో మెదడువాపు ,చికెన్ గున్యా, ప్లేగువ్యాధి, సార్స్ ,  డెంగ్యూ ఇటీవలే వచ్చిన ఎబోలా లాంటి అంటు వ్యాధులకు హోమియో మందులు సమర్థవంతంగా పనిచేసినవి. ఇక చికిత్స విషయానికి వస్తే హోమియోపతి వైద్యం ద్వారా కోవిడ్ వ్యాధిని నయం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది కోవిడ్ వ్యాధి సంక్రమించిన వారికి ఆ వ్యాధి సామాన్య లక్షణాలే కాకుండా రోగి శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేసినట్లయితే  కోవిడ్ వ్యాధి రోగులు సంపూర్ణంగా కోలుకునే అవకాశం ఉంది నిష్ణాతులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి రోగి లక్షణాల స్థాయిని బట్టి చికిత్స చేసినప్పుడు పూర్తి ఫలితం ఉంటుంది. చికిత్స విషయంలో ఇదివరకే భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు హోమియో మందులను సహాయక ఔషధాలుగా వాడవచ్చని పేర్కొంది దీని కోసం హోమియో వైద్యులకు కొన్ని ప్రత్యేకమైన గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది.

◆ ప్రస్తుత తరుణంలో హోమియోపతిలో సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు వైద్యపరంగా సామాన్య ప్రజానీకానికి ఇచ్చే సలహా ఏమిటి ?

వైద్య పరంగా చెప్పుకోవడానికి మనలో హర్డ్ ఇమ్యూనిటీ స్థితి  లేదా వ్యాక్సిన్ రావటం రెండు కరోనా వ్యాధిని నిరోధించ డానికి దోహదం చేస్తాయి. మనం చెప్పుకున్నట్లుగా ఈ రెండు కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశమే వుంది. ఈలోగా వ్యాధి ఉధృతి కూడా అలాగే కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఈలోగా మనకు అందుబాటులో ఉన్న ఇతర వైద్య సాధనాలు ముఖ్యంగా హోమియోపతి మందులు ప్రివెంటివ్ డోసుల పంపిణీ మరియు చికిత్సలో శ్రద్ధ చూపించినట్లయితే జరిగే నష్టంలో కొంతైనా నివారించవచ్చు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అలోపతి వైద్యం ద్వారా పొందలేని ప్రయోజనాలెన్నో ఈ హోమియో వైద్యంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ లో అలోపతి మందులు వాడుతూ సహాయక చికిత్సలను ఉపయోగించుకుంటూ హోమియోపతి మందులను కూడా వాడినట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. సమాజ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ కరోనా వ్యాధి గురించి దాని ప్రభావం గురించి చాలామందికి కచ్చితమైన సమాచారం తెలియదు. ఇంకొక విషయం ఏమిటంటే కరోనా వ్యాధి వచ్చిందని చెప్పుకోవడానికి కూడా చాలామంది దీనిని ఒక సోషల్  ఊహించుకుని భయపడుతున్నారు. ఇది అనవసరమైన ఆలోచన .ఇది ఎవరికైనా రావచ్చు ఇందులో భయపడాల్సిన అవసరం గానీ సిగ్గుపడాల్సిన అవసరం గానీ లేదు .ఇంకా కోవిడ్ వ్యాధి గురించి ఎన్నో లేనిపోని సందేహాలు ఉన్నాయి.ఏ లక్షణం కనిపించినా అది కోవిడ్ అని అనుమానపడుతున్నారు. ఇక జలుబు దగ్గులాంటివి వస్తే  చెప్పనవసరం లేదు. ఇదీ కాకుండా కరోనా వ్యాధి వస్తే అతి ప్రమాదమని బ్రతకటం కష్టం అని కూడా అందరూ భయపడుతున్నారు. దీనివల్ల అసలు కరోనా వ్యాధి వచ్చిన దానికంటే ఈ భయంతోనే ఎక్కువమంది ఆందోళనతో కుంగిపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ అని ఎంత చెప్పినా దానివల్ల డిఫెన్స్ ఏర్పడకపోగా అవగాహన లోపాల వల్ల సోషల్ డిప్రెషన్ , సోషల్  క్రైసిస్ లాంటి సమస్యలతో ప్రజల ప్రాణాలకు సమస్య వస్తుంది. మనం కరోనా నివారణకు ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నా ఈ భయాన్ని పారద్రోలే ప్రయత్నం చేస్తే కరోనా వైరస్ ను పారద్రోలడం ఇంకా సులభం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని మరణాలు కూడా తప్పించవచ్చు. పాజిటివ్ ఆటిట్యూడ్ తో వ్యవహరిస్తే తప్ప ఇంకా ఎక్కువ మంది కి కరోనా పాజిటివ్ వస్తుంది అంతే కానీ మన భయాందోళనలకు కరోనా ఏమీ పారిపోదు.