సీనియర్‌ జర్నలిస్టు లింగంపల్లి శంభాజి మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 10, 2020

సీనియర్‌ జర్నలిస్టు లింగంపల్లి శంభాజి మృతి


హైదరాబాద్‌, జూలై9ి(శుభ తెలంగాణ): సీనియర్‌ జర్నలిస్టు, కవి, రచయిత లింగంపల్లి శంభాజి (52) అనారోగ్యంతో మృతి చెందారు. పాంక్రియాటైటిస్‌ వ్యాధితో బాధపడుతూ గత పది రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సమిపంలోని అంకుషాపూర్‌కు చెందిన శంభాజీ నగర శివారు ఘట్మేసర్‌ సమిపంలోని అవుషాపూర్‌లో నివాసం ఉ టున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో శంబాజీ ఎంఏ ఎకనామిక్స్‌ చదివారు. దాదాపు పాతికేళ్లుగా వివిధ పత్రికల్లో రిపోర్టర్‌గా, సబ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. వార్త దినపత్రిక ప్రారంభంలో జర్నలిస్టుగా చేరిన ఆయన... తేజ టీవీ, మెట్రో ఇండియా, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, నవ తెలంగాణ పత్రికల్లో పనిచేశారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన లక్షిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా పాంక్రియాటైటిస్‌ వ్యాధికి గరైన ఆయన ఒకసారి నిమ్స్‌లో చికిత్స పొందారు. పది రోజుల క్రితం మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఉ స్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శంభాజీ భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం అవుషాపూర్‌లో అంత్యక్రియలు జరిగాయి. శంభాజీ మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు సంతాపం తెలియజేశారు. గురువారం మరణించిన శంభాజీ మృతి జర్నలిస్టు లోకానికి తీరని శోకంగానే భావించాలి. అభ్యుదయ భావాలు కలిగిన జర్నలిస్టుగా ఆయన పత్రికా రంగంలో ఎన్నో సామాజిక అంశాలను స్పృశిస్తూ వార్తలు రాసారు. వార్తలు రాయడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమస్యను సూటిగా చెప్పి మెప్పించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. వార్త దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించిన శంభాజీ ముక్కుసూటి తత్వం. అందుకే ఆయన ఎక్కడా సక్రమంగా నెగలేక పోయారు. అయితే వార్తలను రాయడంలోనూ, వార్తను ఎలా ప్రజెంట్‌ చేయాలో ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. అక్రమాలపై ఎలుగెత్తే గుణం కారణంగా ఆయనకు మిత్రులు తక్కువనే చెప్పాలి. ఆయన మృతికి పలురు జర్నలిస్టు మిత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలం కారణంగా ఆయన భౌతిక కాయం సందర్శించే అవకాశం చాలామందికి లేకుండా పోయింది.గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిసా యి. ఆయన మృతికి తెలంగాణ జర్నలిస్ట్‌ జాక్‌ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఓ ఉదాత్త జర్నలిస్ట్‌ మిత్రుడిని కోల్పోయామని జాక్‌ కన్వీనర్‌ దేవరకొండ కాళిదాసు, కో కన్వీనర్‌ అవ్వారు రఘులు సంతాపం ప్రకటించారు. శంభాజీ తో తమకు గల అనుబంధాన్ని, గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శంభాజీ కుటుటంబాన్ని ఆదుకోవాలని సిఎం కెసిఆర్‌ను కోరారు. శంభాజి మృతి పట్ల తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (టీడబ్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన శంభాజీ నిరంతర అక్షర సైనికుడని వారు పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన జర్నలిస్టుగా సామాజిక స్పృహతో వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిన ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. పేదరికంలో ఉన్న శంభాజీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు విజ్ఞప్తి చేశారు.