చరిత్ర సృష్టించిన అరబ్ దేశం ...! - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 20, 2020

చరిత్ర సృష్టించిన అరబ్ దేశం ...!


 అంతరిక్ష రంగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం చరిత్ర సృష్టించింది. మార్స్ గ్రహానికి ఆర్బిటార్‌ను పంపిన తొలి అరబ్ దేశంగా నిలిచింది. ఇవాళ తెల్లవారుజామున 1.58 నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది. మార్స్ గ్రహానికి వెళ్తున్న రాకెట్‌లో.. ప్రోబ్ ఆర్బిటార్ ఉన్నది. అయితే ప్రయోగం చేసిన గంట తర్వాత వ్యోమనౌక నుంచి ప్రోబ్ ఆర్బిటార్ వేరైంది. మితుషుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాల్లో ప్రోబ్ టెలికాం సిస్టమ్‌ను సెటప్ చేశారు. ప్రోబ్ ఆర్బిటార్ సిగ్నల్స్ కూడా అందించింది. దుబాయ్‌లోని అల్ కవనీజ్ వద్ద ఉన్న మిషన్ కంట్రోల్ టీమ్‌కు ఆ సిగ్నల్స్ కూడా అందాయి. అల్ అమాల్ లేదా ద హోప్ అనే ప్రోబ్ ఆర్బిటార్‌ను .. అంగారక గ్రహానికి పంపిస్తున్నారు. ఆ ప్రోబ్ బరువు 1.3 టన్నులు. జపాన్‌లో ఉన్న తనెగాషిమా స్పేస్‌పోర్ట్ నుంచి దీన్ని ప్రయోగించారు. హెచ్‌-2ఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. దీని కోసం ఎమిరేట్స్ ప్రభుత్వం 735 మిలియన్ల దీరమ్‌లను ఖర్చు చేసింది. ఆరేళ్లుగా ఎమిరేట్స్ ప్రభుత్వం ఈప్రాజెక్టు కోసం కృషి చేస్తున్నది. మొత్తం 135 మంది ఎమిరేట్ ఇంజినీర్లు, సైంటిస్టులు, పరిశోధకులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు. రోదసి నుంచి ప్రోబ్ ఆర్బిటార్ సిగ్నల్ పంపడంతో.. దుబాయ్‌లో ఆనందోత్సహాలు వెల్లువెరిశాయి. హోప్ ప్రోబ్‌కు సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఆ ప్యానల్స్‌.. బ్యాటరీలను ఛార్జ్ చేస్తాయి. వాటితోనే ఆ ప్రోబ్ సుమారు 495,000,000 కిలోమీటర్లు జర్నీ చేయనున్నది. 
 ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )