గురుకులంలో చదివి వర్సిటీకి ఎంపిక - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

గురుకులంలో చదివి వర్సిటీకి ఎంపిక

‘గురుకుల’ వారధి పేదింటి బిడ్డలకు ఉన్నత లక్ష్యం చూపుతున్నది.. పేదరికాన్ని తరిమికొట్టి చదువుల బిడ్డలను తయారు చేస్తున్నది.. విద్యాబుద్ధులు నేర్పి గొప్పవాళ్లను చేస్తున్నది.. బంగారు భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే దివ్య, అదితి. హైదరాబాద్‌ శివారులోని గౌలిదొడ్డి టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసిన వీరిద్దరు చెన్నైలోని ప్రతిష్ఠాత్మక క్రే వర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించారు. రూ.28.5 లక్షల ఫీజు రాయితీ కింద బీఏ ఎకనామిక్స్‌ కోర్సుకు దివ్య, బీఎస్సీ కోర్సులో చేరేందుకు అదితి ఎంపికైనట్టు వర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఈ విషయాన్ని వారికి ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది. 

ఎంపిక చేశారిలా..

దరఖాస్తు చేసుకున్న గురుకుల విద్యార్థులకు టెన్త్‌, ఇంటర్‌ మార్కుల ఆధారంగా క్రే వర్సిటీ ఆరు నెలల కిందట అర్హత పరీక్ష నిర్వహించింది. తెలంగాణ నుంచి దరఖాస్తు చేసుకున్న 15 మంది గురుకుల విద్యార్థులకు వ్యాసరచన, ఆప్టిట్యూడ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, యాక్టివిటీస్‌, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎంపికచేసింది. ఈ ప్రక్రియలో దివ్య, అదితి మూడేండ్ల కోర్సు చదివేందుకు ఎంపికయ్యారు.

కూలీ కుటుంబం నుంచి..

మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామం. మా నాన్న బూర సత్తయ్య, అమ్మ కళమ్మ రోజూవారీ కూలీలు. కుటుంబానికి అండగా నిలిచేందుకు కష్టపడి చదువుతున్నాను. సీఎం కేసీఆర్‌ ఉన్నత లక్ష్యంగా గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండటం వల్లే నాకు ఇంటర్‌లో 96.6 శాతం మార్కులు వచ్చాయి. నాకు వచ్చిన మార్కులు, కుటుంబ పరిస్థితి, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మా కళాశాల ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు అందించిన ప్రోత్సాహం వల్లే చెన్నై వర్సిటీలో డిగ్రీలో ప్రవేశానికి ఎంపికయ్యాను. కష్టపడి చదివి ఈ కోర్సును పూర్తిచేసి ఆర్థికవేత్తగా ఎదగాలన్నదే నా లక్ష్యం.               
- దివ్య

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా

ఇంటర్‌ బైపీసీలో ఎక్కువ మార్కులు సాధించడం, క్రే వర్సిటీలో బీఎస్సీ కోర్సు ఉచితంగా చదివేందుకు అవకాశం దక్కడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. కష్టపడి చదివి శాస్త్రవేత్తను అవుతాను.         
- అదితి