హైదరాబాద్ నుంచి వస్తే క్వారెంటైన్... మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

హైదరాబాద్ నుంచి వస్తే క్వారెంటైన్... మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..

హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరం నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న రీత్యా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు సంబంధించి స్థానిక అధికారులు,ప్రజా ప్రతినిధులు,రైతు సమన్వయ సమితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు.
ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతిక దూరం,పరిశుభ్రత పాటించాలని చెప్పారు. స్వీయ నియంత్రణ అవసరమని.. ప్రజలను భాగస్వాములుగా చేసుకుని అధికారులు,ప్రజాప్రతినిధులు కరోనా నియంత్రణకు పాటుపడాలని చెప్పారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల వ‌ల్లే క‌రోనా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌ట్ట‌డిలో ఉంద‌న్నారు.
ఈ సందర్భంగా పాలకుర్తిలో రైతు వేదికకు ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. తెలంగాణ‌కు 6వ విడ‌త హ‌రిత హారంలో భాగంగా క్యాంపు కార్యాల‌యంలో,రైతు వేదిక స్థ‌లం వ‌ద్ద,మరికొన్ని చోట్ల మొక్క‌లు నాటారు. ఒక్క జనగామ జిల్లాలోనే ఈ ఏడాది 65ల‌క్ష‌ల 92వేల మొక్క‌లు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. క‌ల్లాలు, రైతు వేదిక‌ల ద‌ర‌ఖాస్తుల‌కు మ‌రో వారం రోజుల‌పాటు గ‌డ‌వు పెంచుతున్న‌ట్లు తెలిపారు.