నిర్మల్ జిల్లాలో 'ఆలన వాహనం' ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

నిర్మల్ జిల్లాలో 'ఆలన వాహనం' ప్రారంభం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక వైద్య చికిత్స అందించేందుకు ఆలన వాహనం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలన వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటున్న వయోవృద్ధులకు జిల్లా దవాఖానలో వైద్య నిపుణులచే చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలన వాహనాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
వాహనంలో డాక్టర్ తో పాటు ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారని, ప్రతి గ్రామంలో పక్షవాతం, టీబీ వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించి జిల్లా దవాఖానలో వైద్య నిపుణులచే చికిత్స అందిస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.వసంత్ రావు, డా.కార్తీక్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, నాయకులు రాంకిషన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.