మూడు రాజధానులకు ఆమోదం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

మూడు రాజధానులకు ఆమోదం


- రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం
 - మూడు వారాల క్రితం బిల్లులను గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం
 -  గవర్నర్ ఆమోదంతో ఏర్పాటు కానున్న మూడు రాజధానులు

అమరావతి, జూలై 31(శుభ తెలంగాణ); వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటుకానుంది. శాసన రాజధానిగా అమరావతి, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి. జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసన మండలిలో ఈ బిల్లులు మొదట పాస్ కాలేదు. ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో, జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసి, ఆ తర్వాత, శాసన మందలికి పంపింది. అనంతరం నెల రోజుల తర్వాత బిల్లు ఆటోమేటిక్ గా పాస్ అయినట్టుగా భావించి, గవర్నర్ ఆమోదానికి పంపారు. ఈ నేపథ్యంలో, ఈ బిల్లుల పై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి.