వివాదాలకు మోదీ సర్కార్‌ ఆజ్యం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 10, 2020

వివాదాలకు మోదీ సర్కార్‌ ఆజ్యం

నీళ్లు చల్లనివి.. కానీ ఆ నీళ్లలోనే బడబాగ్ని దాగి వుంటుంది నీళ్లు ఉల్లాసాన్నిస్తాయి.. కానీ మనసును రగిలిస్తాయి కూడా నీళ్లలో జరిగిన అన్యాయమే తెలంగాణకు మూల సమస్య.. అలాంటప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పాటు సమయంలో నీటి వాటాల పకంలో కేంద్రం ఎంత బాధ్యతగా ఉండాలి? ఇది మీ నది.. ఇదీ మీ వాటా.. ఇదీ నికరం.. ఇదీ మిగులు.. మీ ప్రాజెక్టులు ఇలా కట్టుకోండి అని తేల్చేయాలా వద్దా? ఏడాదిలో తేల్చేదానికి ఆరేండ్లు గడిచిపోయాయి. ఎక్కడవేసిన గొంగడి అక్కడే. మాట రాదు. మార్గం చూపరు.తెలంగాణ, ఏపీ విషయంలోనే కాదు.. దేశంలోని జల వివాదాలన్నింటిలోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరి అంతే. కర్ర విరగదు. పాము చావదు. ఫిర్యాదులు, పంచాయతీలు రాగానే ఏదో హడావుడి చేయడం, ప్రాజెక్టులను అడ్డుకొనేలా ఉత్తర్వులివ్వడం, అప్పటికి దాటవేయడం, విషయాన్ని అటకెక్కించడం. ఇదీ కేంద్రం బాధ్యతారాహిత్యం. అంతే తప్ప నిర్ణీత కాలవ్యవధి ఒకటి పెట్టుకొని ఇరుపక్షాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచన కేంద్రంలో ఇసుమంతైనా కనిపించడం లేదు. కేంద్రం నిర్లక్ష్యధోరణి నీళ్లలో నిప్పుల్ని రాజేస్తున్నది. సత్వరమే సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్న రాష్ర్టాలకు సంకటంగా మారుతున్నది. వాస్తవంగా కృష్ణాజలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వివాదాలున్నాయి. గోదావరిలో నీటి లభ్యత విషయంలో ఢోకా లేదు. ఏటా 3,4వేల టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణాలో నెలకొన్న వివాదాల వల్లే గోదావరిలోనూ రెండు రాష్ర్టాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఇందుకు కేంద్రం కృష్ణా జలాలపై సమస్యల్ని తీర్చకపోవడమే ప్రధాన కారణం. ఆరేండ్లయినా నీటి వాటా తేల్చని కేంద్ర ప్రభుత్వం.. తిరిగి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులంటే 2014, జూన్‌ 2వ తేదీ (రాష్ట్ర ఏర్పాటు)ని కటాఫ్‌గా నిర్ణయించడం మరీ విడ్డూరం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ప్రాజెక్టులు కేవలం కాగితాల్లోనే నలిగిపోతున్నాయని, కట్టిన అరకొర ప్రాజెక్టుల డిజైన్‌ కూడా ఈ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆది నుంచి ఇక్కడి సమాజం మొత్తుకున్నది. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తోపాటు కాగితాలపై నానుతున్న ప్రాజెక్టుల్ని ఆచరణరూపంలోకి తీసుకు వస్తున్నది. కానీ.. ఆ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వెంటనే పనులు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించడం, అందుకు తెలంగాణ లోని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు వత్తాసు పలుకడం మరింత విచిత్రం. 
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏదైనా ఒక రాష్ట్రం నీటి సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకొని ఏడాదిలోపు వాటికి పరిష్కారం చూపాలని అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్‌-4(1) చెప్తున్నది. ఆరు దశాబ్దాలపాటు సాగునీటిరంగంలో అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినందున.. ఇకనైనా న్యాయమైన వాటా తేల్చండి అంటూ 2014, జూలై 14న కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. ఒకటికాదు.. రెండు కాదు.. రాష్ట్ర విభజన జరిగి ఆరేండ్లు దాటినా నీటి వాటాలను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. 

Post Top Ad