దగ్గర్లోనే పట్టాభిషేక.. ముహూరం! - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 20, 2020

దగ్గర్లోనే పట్టాభిషేక.. ముహూరం!


హైదరాబాద్, ఆగస్టు 19(శుభ తెలంగాణ): కేటీఆర్ సీఎం కావడానికి త్వరలో పట్టాభిషేకం ఉంటుందా? ఇటీవల పరిణామాలు చూస్తుంటే అటువంటి సంకేతాలే ఇస్తున్నాయని హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. మరోవైపు గులాబీ దండులోని ఓ వర్గం ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్‌ను కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ వెనుక పార్టీ పెద్దల హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పట్టాభిషేకం వార్తలతో కేటీఆర్ టీమ్ జోష్ లో కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల బోధన ఎమ్మెల్యే షకీల్ నేరుగా కెటిఆర్‌ను సిఎం చేయాలని కోరారు. గతంలో ఇలా అనేకమంది కెటిఆర్ కు నాయకత్వం అప్పగించాలని సూచించారు. ఇదంతా కెసిఆర్ ఇష్టానుసారమే జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయమూ గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు సచివాలయం కూడా లేదు కనుక ఇక భయం కూడా పోయి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో జరిగే ప్రతి పనికి ముందు ఇలాంటి ముందస్తు వ్యూహం ఉ ంటుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందరినీ ముందే సిద్ధం చేసి అనుకున్న పనిని చేసేయడం కెసిఆర్ వ్యూహం అని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలన్నీ గులాబీ పార్టీ ఇలాగే అమలు చేసింది. తాజాగా కేటీఆర్ సీఎం అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. చాలా సార్లు ఇదే చర్చ జరిగినా ఈసారి ఒక అడుగు ముందుకు వేసి సీఎం స్థానంలో ఉండి చేయాల్సిన పనులన్నీ మంత్రి కేటీఆర్ చేస్తుండడంతో ఆయనే సీఎం అవుతున్నారని పార్టీలోని కేటీఆర్ కోటరీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పార్టీలోని అసంతృప్తులకు కేటీఆరే సీఎం అవుతారని పరోక్షంగా చెప్పినట్టేనని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా ఇలీవల ప్రగతిభవన్‌లో సమీక్ష చేపట్టడం, వరంగల్ పర్యటన అట్టహాసం అంతా ఇదే కోవలోనిదన్న ఆరోపణలు ఉన్నాయి.