పంద్రాగస్ట్ వేడుకలు ప్రగతిభవన్లో? - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

పంద్రాగస్ట్ వేడుకలు ప్రగతిభవన్లో?


హైదరాబాద్,ఆగస్ట్ 13(శుభ తెలంగాణ): పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్ లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో కేందరం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రగతి భవన్లోనే నిర్వహించ వచ్చని తెలిసింది. వర్షాలు కూడా భారీగా పడే అవకాశం ఉండడంతో పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు ఇచ్చి జరపనున్నట్లు సమాచారం. అధికారులు కూడా ఇక్కడే మేలని సూచించారని సమాచారం. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోనే పతాకా విష్కరణ చేస్తారని సమాచారం. వాస్తవానికి 2019 సంవత్సరపు గణతంత్ర ఉత్సవాలు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండులో జరిగాయి. ఆ తర్వాత అన్ని ఉత్సవాలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2019లో జూన్ 2న రాష్ట్రావ్రతరణ ఉత్సవాలు, ఆగస్టు 15న స్వాతంత్య దినోత్సవం పబ్లిక్ గార్డెన్ లో జరిగాయి. ఈ సంవత్సరం గణతంత్ర ఉత్సవాలు కూడా అక్కడే జరిగాయి. కరోనా లా డౌన్ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్రావతరణ ఉత్సవాలు మాత్రం ప్రగతి భవన్‌లో జరిగాయి. సీఎం కేసీఆర్ అక్కడే జెండాను ఆవిష్కరించారు. అలాగే ఈ నెల 15న స్వాతం త్య దినోత్సవాన్ని కూడా ప్రగతి భవన్ లోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా తగ్గుముఖం పట్టకపోవడం, పంద్రాగస్టుకు పోలీసు పరేడ్ ఉండకపోవడం వంటి కారణాలతో ప్రగతి భవన్లోనే ఉత్సవాన్ని నిర్వహిస్తారని సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ 15న ఉదయం 10.30 గంటలకు జెండాను ఆవిష్కరిస్తా రని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జెండావిష్కరణ ఎక్కడన్నదీ స్పష్టం చేయలేదు. మిగతా 32 జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేసే మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వేడుకల సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, జెండావిష్కరణకు పరిమిత సంఖ్యలో హాజరు కావాలని సూచించారు. దీనికితోడు స్కూలు పిల్లలను వేడుకల్లో మినహాయించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.