ఉదృతంగా గోదావరి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 18, 2020

ఉదృతంగా గోదావరి


భదాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 17(శుభ తెలంగాణ): గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకు ప్రవాహం పెరుగు తున్నది. ఇప్పటికే చివరిదైన మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడం ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నది నీటిమట్టం రికార్డు స్థాయికి చేరింది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద చేరడంతో ఏజెన్సీలోని నది పరివాహక ప్రాంతాలు వణికి పోతున్నాయి. గోదావరి నీటిమట్టం 6 గంటలకు 48.1 అడుగుకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు 53 అడుగులకు చేరడంతో చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం ఎగువన ఉన్న ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల, దుమ్ము గూడెం మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఉచిత నిత్యాన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. కల్యాణకట్ట నీట మునిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చివరి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించడం ఆరేళ్ల తరువాత ఇదే తొలిసారి. సోమవారం ఉదయానికి నది నీటి మట్టం 58.1 అడుగులకు చేరింది. పినపాక మండలంలోని కోయగూడెం కుగ్రామమైన సింగిరెడ్డిప్ల చుట్టూ నాలుగువైపుల నుంచి వరద ముంచెత్తడంతో 25 కుటుంబాలు జల వలయంలో చిక్కుకున్నాయి. భద్రాచలం పరిసర రహదారులపైకి వరద నీరు పోటెత్తడంతో ఏజెన్సీ మండలాలకు, విలీన మండలాలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకే ఆర్టీసీ బస్సులను పరిమితం చేశారు. తాలి పేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 25 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. అలాగే మూడో ప్రమాద హెచ్చరికను సైతం దాదాపు ఆరేళ్ల తర్వాత జారీ చేసినట్లు పేర్కొన్నారు. 2014, సెప్టెంబర్ 8న భద్రాచలం వద్ద 56.1 అడుగుల మేర ప్రవహించింది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక జారీతో భద్రాచలం ఏజెన్సీ అతలాకుతలం అవుతోంది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లో లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. చర్ల, దమ్ము గూడెం మండలాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం నుంచి భద్రాచలానికి రాకపోకలను అధికారులు అదుపు చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల ను అధికారులు రద్దు చేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతితో భద్రాద్రి పవర్ ంట్లోకి వరద నీరు చేరింది. మణుగూరు మండలం కొండాయిగూడెం శివాలయంలోని నీళ్లు చేరాయి. అలాగే చిన్నరాయి గూడెం జలదిగ్బంధమైంది. సహాయక చర్యల్లో ఎమ్మెల్యే రేగా.. బూర్గంపహాడ్ మండల పరిధిలోని బూర్గంపహాడ్, రెడ్డిపాలెం, సంజీవ రెడ్డి పాలెం, మొరంపల్లి బంజర్ గ్రామాలను గోదావరి చుట్టేసింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడం ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆయా గ్రామాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పిల్లలకు బ్రెడ్లు, బిస్కెట్స్ ప్యాకెట్స్ అందజేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Post Top Ad