వానలు, వరదలపై ప్రత్యేక దృష్టి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 17, 2020

వానలు, వరదలపై ప్రత్యేక దృష్టి

వారంరోజులుగా ముసురుకున్న వానకు రాష్ట్రం తడిసి ముద్దవుతున్నది. అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల పరిస్థితిపై ఆదివారం ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మంత్రులతో మాట్లాడి జిల్లాల్లోనే ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎస్‌తో మాట్లాడి వెంటనే కంట్రోల్‌ రూం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేశారు. ఎవరి ఎలాంటి కష్టం వచ్చినా 040-23450624కు కాల్‌చేయాలని సూచించారు. వెంటనే జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తంచేశారు. వరంగల్‌ జిల్లాలో వరద తీవ్రత దృష్ట్యా మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్‌.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ప్రత్యేకంగా మాట్లాడి ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఇతర జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వరంగల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 3,500 మంది ముంపు బాధితులకు అక్కడికి తరలించారు. గోదావరి వరద ముంపునకు గురైన ములుగు, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు పునరావాసం కల్పించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించి అధికారులకు తగిన సూచనలుచేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌, గార్ల, రాంపూర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు వాగు వరద ముంపు ప్రాంతాల ప్రజలను సమీపంలోని పాఠశాలలకు తరలించి, అహార పదార్థాలు అందించారు. మంత్రులు నిత్యం జిల్లాస్థాయి, స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. చెరువులు, కుంటల కట్టలు తెగకుండా అధికారులను అప్రమత్తంచేస్తున్నారు.