పోరాటం అద్వానీది.. ఫలితం మోడీది - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 11, 2020

పోరాటం అద్వానీది.. ఫలితం మోడీది


పోరాటం అద్వానీది అయితే ఫలితం మాత్రం నరేంద్ర మోడీ దక్కించు కున్నారు. 2014 ఎన్నికల సమయంలో అద్వానీని కాదని తెరపైకి మోడీని తెచ్చారు. దీనిని అద్వానీ కూడా వ్యతిరేకించారు. అయినా ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి మోడీని సారథిగా ప్రకటించారు. దీంతో అద్వానీ ఇన్నేళ్ల శ్రమ వృదా అయ్యింది. ఆయనకు ప్రధాని అయ్యే ఛాన్స్ దక్కలేదు. కనీసం రాష్ట్రపతిగా అయినా గౌరవం దక్కుతుందనుకున్నా అదీ దక్కలేదు. దీంతో కురువృద్ధుడు అయిన అద్వానీ బిజెపి కోసం శ్రమించినా ఆయనకు ఫలితం దక్కలేదు. ఇకపోతే అయోధ్య విషయంలో కూడా అదే జరిగింది. పోరాట వీరుడు అద్వానీ అయితే ఫలితం మాత్రం ఇప్పుడు మోడీ ఖాతాలో చేరింది. అయితే సుప్రీం తీర్పు అనుకూలంగా రావడంలో ఆయన పాత్ర ఎనలేనిదని చెప్పుకోవాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేయడం ద్వారా భక్తుల మనసులను కొల్లగొట్టారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కొవిడ్ గురించి జనం తాత్కాలికంగా మరచిపోయారు. శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించడం మోదీకి మాత్రమే సాధ్యమైందని దేశ ప్రజలు కొనియాడుతున్నారు. నిజానికి శతాబద్దాలుగా నలుగుతున్న సమస్యకు మోడీ పరిష్కారం చూపారనే చెప్పాలి. జాతీయ స్థాయిలో రామ మందిరం నిర్మాణానికి భారీ మద్దతు దక్కింది. ఎన్నారైలు కూడా అపూర్వ స్వాగతం పలికారు. ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆశలను సాకారం చేసిన నేతగా మోడీ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. రామాలయానికి భూమిపూజ జరిగిన ఆగస్టు 5వ తేదీకి సరిగ్గా ఏడాది ముందు అదే తేదీనాడు ఒక దేశం.. ఒకే చట్టం అనే తన చిరకాల స్వప్నాన్ని మోదీ ప్రభుత్వం సాకారం చేసుకున్నది. దేశంలో ఎక్కడా పెద్ద వ్యతిరేకత కనిపిం చనీయకుండా 370వ అధికరణాన్ని చాకచక్యంగా రద్దు చేయగలి గింది. భూమిపూజ తర్వాత రెండు రోజులకే ప్రధాన మంత్రి ఒక సెమినార్ లో మాట్లాడుతూ ఒక దేశం ఒకే విద్య అని మరో పిలుపునిచ్చారు. ఈ మేరకు నూతన విద్యావిధానాన్ని ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదిం చింది. ఇప్పుడున్న విద్యావిధానం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అమ లులోకి వచ్చింది. ఆదర్శాలు ఎలా ఉన్నా ఆచరణలో ఈ విధానం విద్యను అంగడి సరుకుగా మార్చివేసింది. ఈ చేదు అనుభవం ఫలితంగానే, కొత్త విద్యావిధానాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ప్రైవేట్ దోపిడీదార్ల పాలిటి కామధేనువు లాంటి ఇంటర్మీడియట్ అదృశ్యం కాబోతున్నది. ఈ కొత్త విధానం అమలులోకి రావడానికి ఆటంకాలేమీ కనిపించడం లేదు. ఒక దేశం.. ఒకే చట్టం... ఒకే విద్య... తర్వాత వచ్చే ఆ ఒక్కటి ఏమై ఉంటుందన్న చర్చ సాగుతున్న వేళ మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. 'కాంగ్రెస్ ముక్త భారత్' తన విధానంగా బీజేపీ ఎప్పుడో ప్రకటించు కున్నది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైతే ఇక మిగిలే జాతీయ పార్టీ బీజేపీ ఒక్కటే. మిగిలిన జాతీయ పార్టీలు పేరుకే తప్ప వాటి ఉనికి నామమాత్రమే. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ తన ఉనికిని బలంగా చాటుకునే పరిస్థితిలో ఉన్నది. అందులో జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ల రూపంలో రెండు రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. రామాలయ రూపంలో ముంచుకు వచ్చిన ముప్పును ముందే గ్రహించిన ప్రియాంకాగాంధీ రామమందిరం భూమి పూజను బహిరంగంగా స్వాగతించారు. అయినా ఇప్పట్లో మోడీని ఢీకొనడం ఎవరి తరం కాకపోవచ్చు. అద్వానీ కూడా చరిత్రకు సాక్షీభూతంగా మౌనమునిగా ఇప్పటికే మిగిలారు.