వివాదాల్లోకి హైదరాబాద్‌ నగర శివారు స్థలాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 17, 2020

వివాదాల్లోకి హైదరాబాద్‌ నగర శివారు స్థలాలు

ముందుచూపుతో హైదరాబాద్‌ శివారులో స్థలాలు కొన్న మధ్యతరగతి కుటుంబాల కలలు చెదిరిపోతున్నాయి. రియల్‌ మోసాలతో సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. రెండు దశాబ్దాల కిందట పిల్లల చదువు, పెండ్లిల కోసం కొన్న ప్లాటు ఇప్పుడు అమ్ముదామంటే దానిని రియల్‌ మోసగాళ్లు దాదాపు 4 నుంచి 5 ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి గందరగోళం చేసి పడేశారు. రియల్‌ మోసాలకు కొంతమంది రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసులు, ఇతర అధికారులు సహకరిస్తుండటంతో సామాన్యులకు సమస్యలు తప్పడంలేదు. దీంతో ఆ స్థలాలను రియల్‌ మోసగాళ్లకు తక్కువ ధరకే అమ్ముకోక తప్పని పరిస్థితి నెలకొన్నది.


రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ డీసీపీ జోన్‌పరిధిలో ఓ టైరు పంక్చర్లు చేసుకొని జీవించే ఓ వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కలిసి ఓ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి.. వాటితో వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేశాడు. కొన్న వ్యక్తి ఆ పత్రాలను కుదువపెట్టి దాదాపు 10 లక్షలు రుణం తీసుకున్నాడు. ఆన్‌లైన్‌ సెర్చ్‌తో విషయం తెలుసుకున్న అసలు యజమాని.. తనకు సంబంధం లేకుండానే ప్లాటు ముగ్గురు చేతులు మారిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. వారు విచారణ జరిపి 11 మందిని అరెస్టుచేశారు.

రెండ్రోజుల కిందట ఏసీబీకి పట్టుబడ్డ కీసర తాసిల్దార్‌ నాగరాజు బాధితులు ఎంతోమంది ఉన్నారు. కీసర ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వ్యక్తికి ఎకరాల్లో స్థలం ఉన్నది. అతని పేరుపైనే విద్యుత్‌ మీటరు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. కానీ, ఆ వ్యక్తికి కాకుండా ధన, అంగబలం ఉన్న ఓ బడా వ్యాపారికి పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. లంచాలు తీసుకుని అతనికి పొజిషన్‌ ఇప్పించారు. దీనిపై బాధితుడు తాసిల్దార్‌ నాగరాజును కలిశాడు. ‘నీ దగ్గర అన్ని పత్రాలున్నా నేను న్యాయం చేయలేను. ఎందుకంటే మీ ప్రత్యర్థి దగ్గర డబ్బు తీసుకున్నాను’ అంటూ నేరుగా చెప్పాడని బాధితుడు వాపోయాడు. 

ఎల్బీనగర్‌ డీసీపీ జోన్‌ పరిధిలో ఓ డివిజన్‌కు ఏసీపీగా వచ్చిన అధికారి చేష్టలతో కిందిస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు తమ పోస్టింగ్‌లను మార్పించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పక్కరాష్ట్రంలోని పోర్టు ప్రాంతానికి చెందిన ఓ బడాబాబు పదేండ్ల నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆనుకుని స్థలాల్లో తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాడు. బడాబాబుకు ఏసీపీ 15 రోజులపాటు సహకరించినందుకు దాదాపు రూ.20 లక్షలు తీసుకుని స్థలానికి కంచె వేయించాడని రైతులు, అసలు యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సివిల్‌ పంచాయితీల్లో తలదూర్చమని చెప్పే పోలీసులు కొంతమంది దారితప్పి ‘ఇది పెద్దసార్లు చెప్పారు. మీరు కాంప్రమైజ్‌ అయిపోండి’ అని అంటుండటం విస్మయానికి గురిచేస్తున్నది.

Post Top Ad