వెనుకబడిన ప్రాంతాలకు 900 కోట్లివ్వండి : కేంద్రానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 19, 2021

వెనుకబడిన ప్రాంతాలకు 900 కోట్లివ్వండి : కేంద్రానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి

- మేం నష్టపోయిన 723 కోట్లను వెంటనే విడుదల చేయండి

- వెనుకబడిన ప్రాంతాలకు 900 కోట్లివ్వండి : కేంద్రానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి

- కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వాలి


ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రాంట్లను బడ్టెట్లో పొందుపరిచి సంపూర్ణంగా అమలు చేయటమనేది మన దేశంలో సాంప్రదాయంగా వస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు గుర్తు చేశారు. అయితే పదిహేనో ఆర్థిక సంఘం తెలంగాణకు సంబంధించి చేసిన

సిఫారసుల్లో కొన్నింటిని కేంద్రం అంగీకరించలేదని తెలిపారు. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లను రాష్ట్రం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పై చర్చించేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌... సోమవారం అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్‌సీఆర్‌ హెచ్‌ఆర్‌డీ) నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు కేంద్రం ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. వీడియో కాన్ఫరెన్సులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హరీశ్‌రావు ప్రతిపాదనలు...

- ఆర్థిక సంఘం ప్రతీ ఏడాది చేసే సిఫారసులను యధాతథంగా అమలు చేయాలి. వచ్చే బడ్జెట్‌లో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి

- కేంద్రం వసూలు చేస్తున్న సెస్‌, సర్‌ఛార్జి మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కలపకపోవటం వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. అందువల్ల వాటిని రద్దు చేయాలి. వాటి స్థానంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల రేట్లను పెంచి అధికంగా నిధులను విడుదల చేయాలి

- కోవిడ్‌ కారణంగా రాష్ట్రాలకు జీఎస్డీపీలో రెండు శాతం అదనంగా రుణాలను తీసుకునే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వ పెట్టుబడుల (పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌)ను ప్రోత్సహించాల్సి ఉన్నందున ఈ వెసులుబాటును 2021-22 ఆర్థిక సంవత్సరానికి కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనసాగించాలి

- రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయాన్ని అందించాలి. ఇందులో భాగంగా గతేడాది, ఇప్పుడు కలిపి రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ఈ సాయాన్ని ఐదేండ్లపాటు కొనసాగించాలి

- మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్రం యాభై శాతం జిల్లాలకు మాత్రమే వర్తింపజేస్తున్నది. దీన్ని వంద శాతానికి (అన్ని జిల్లాలకు) విస్తరిస్తామంటూ గత బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. ఇప్పటి వరకూ అది అమలు కాలేదు. అందువల్ల ఈ వడ్డీ రాయితీ పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేయాలి. ఇప్పటి వరకూ ఉన్న బకాయిల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి

- బీహార్‌లో ప్రకటించిన విధంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ను దేశమంతటా ఉచితంగా పంపిణీ చేయాలి

- ఎన్‌ఎస్‌ఏపీ పథకం కింద వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కేంద్రం ఎన్నో ఏండ్ల నుంచి కేవలం రెండొందల సాయాన్ని మాత్రమే అందిస్తున్నది. దీన్ని కనీసం వెయ్యి రూపాయలకు పెంచాలి.. జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే విడుదల చేయాలి.