కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ సూచనలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 12, 2021

కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ సూచనలురాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని పేర్కొన్నారు.


పట్టణాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏటా రూ.148 కోట్లు విడుదల చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (జనవరి 11) ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ చేసిన సూచనలు

★ అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలి. లక్ష జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామాలు నిర్మించాలి. దీని కోసం అవసరమైతే మున్సిపాలిటీల నిధులతో స్థలాలను కొనుగోలు చేయాలి.


★ రాష్ట్రంలోని 116 పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ (సమీకృత) మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనాభా ఎక్కువ కలిగిన పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలి. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం.


★ వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు.. ముఖ్యంగా మహిళలు టాయిలెట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలి. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి.


పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో, వాయు కాలుష్యంలో జీవించడం మంచిది కాదు. పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంది.

సీఎం కేసీఆర్


★ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మిగిలిపోయిన లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలి. రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు రెండు విడతలుగా గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మొదటి విడత చివర్లో కరోనా రావడంతో ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. మొదటి విడతలో మిగిలిపోయిన 28 వేల మంది లబ్దిదారులకు గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి.


★ అన్ని గ్రామాల్లో చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. చెరువుల రక్షణ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కమిటీలను నియమించాలి.


★ ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు కల్పించాలి. పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వస్తుంది. జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలి. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలి.


★ హరితహారం వల్ల రాష్ట్రంలో మూడేళ్లో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. సామాజిక అడవుల పెంపకంతో పాటు అటవీ ప్రాంతాల్లో అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కలప స్మగ్లింగ్ పూర్తిగా అరికట్టాలి. స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలి.


★ రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతోంది. పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలి.


★ ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించే ఏర్పాటు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణాల్లో 2,802 సానిటైజేషన్ వాహనాలు ఉన్నాయి. మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్‌ను సమకూరుస్తున్నాం. మొత్తం 4,806 వాహనాలు అందుబాటులోకి వస్తాయి.


★ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో 1,018 నర్సరీలను, జీహెచ్ఎంసీలో 500 నర్సరీలను ఏర్పాటు చేశాం.