హైదరాబాద్‌కు మరో ఐటీ సెజ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 18, 2021

హైదరాబాద్‌కు మరో ఐటీ సెజ్



తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో ఐటీ సెజ్ మణిహారం కానుంది. రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో రూ. 823 కోట్లతో 3.6 ఎకరాల్లో ఐటీ, దాని అనుబంధ కార్యకలాపాల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు కోసం సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ అనే సంస్థకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అనుమతుల మండలి (బోర్డ్‌ ఆఫ్‌ అప్రూవల్‌) ఆమోదం తెలిపింది. తాము 2,13,125 చదరపు మీటర్ల నిర్మాణ స్థలంలో సెజ్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 17,500 మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ దరఖాస్తు చేసుకుంది.    దీనికి సెజ్‌ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిల్లీలో జరిగిన బీవోఏ సమావేశంలో అనుమతులు మంజూరు చేసింది. ఈ సెజ్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే రాయితీలు వర్తించనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 22 ఐటీ సెజ్‌లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మరో 19 సెజ్‌లకు కేంద్రం అనుమతులిచ్చినా అవి నడవడం లేదు. తాము సెజ్‌లను నిర్వహించలేమని ఆయా సంస్థలు చేతులెత్తేయడంతో కేంద్రం వాటి అనుమతులు రద్దు చేసింది. తాజాగా సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ ఐటీ సెజ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్రం అన్ని కోణాల్లో పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్న తర్వాతే అనుమతులు జారీచేసింది.