చికెన్ ప్రియులు, బర్డ్ ఫ్లూ భయంతో ఇప్పుడు కోడికూర తినేందుకు జంకుతున్నారు. కొన్నాళ్లుగా చికెన్ సెంటర్ల వైపే వెళ్లడం లేదు. పలుచోట్ల ధరలు రూ. 60 నుంచి 80 మేర తగ్గినా చికెన్ కొనేందుకు ఇష్టపడకపోవంతో ఆ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మునుపటి స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూతో పక్షులు, కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు రావడం, మన రాష్ట్రంలోనూ దీనిపై బాగా ప్రచారం జరగుతుండడంతో చికెన్ ప్రియులు జంకుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్‌లో ఏదైనా వైరస్ ఉంటే 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చనిపోతుందని పశువైద్యాధికారులు చెబుతున్నప్పటికీ. చాలామంది బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. దీంతో గతంలో రోజుకు క్వింటాళ్ల కొద్దీ కోళ్లను, కోడి మాంసాన్ని విక్రయించిన వ్యాపారులు.. అందులో ఇప్పుడు 10 నుంచి 20 శాతం అమ్మకాలు కూడా చేయలేకపోతున్నారు.
బర్డ్ ఫ్లూ అన్నది కేవలం అపోహే. మన దగ్గర అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు కూడా ఇదే చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. స్నాప్ చాట్, తదితర సోషల్ మీడియాలో పాత వీడియోలను వైరల్ చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలి. ఇలాంటి ప్రచారంతో వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వదంతులు ఎవరూ నమ్మొద్దు 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో చికెన్ వండుకుంటాం కాబట్టి అసలు ఎలాంటి సమస్యలుండవు.